మంత్రి తుమ్మల
వ్యవసాయం నుండి ఐటీ వరకు మనం ఉంటాం
ఎమ్మెల్సీ తాత మధు
కాకతీయ, ఖమ్మం: కార్తీక మాస సందర్భంగా కమ్మ మహాజన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం చెరుకూరి వారి మామిడితోటలో నిర్వహించిన వనసమారాధన కార్యక్రమం సందడిగా జరిగింది. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో కుటుంబాలు తరలివచ్చి పూజలు, వనభోజనాల్లో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ కమ్మ కులం ఎక్కడ ఉన్నా అక్కడ అభివృద్ధి జరుగుతుందని, కృషి, నిబద్ధత, పట్టుదల వల్లే అన్ని రంగాల్లో కమ్మవారు గుర్తింపు పొందుతున్నారని అన్నారు. వ్యవసాయాన్ని పునాది చేసుకుని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలపరిచిన వర్గం కమ్మవారేనని గుర్తుచేశారు. గ్రామీణాభివృద్ధి, సాగు విస్తరణ, సామాజిక సేవల్లో కమ్మ సంఘాలు చేస్తున్న కార్యక్రమాలు ప్రశంసనీయమని తెలిపారు. ఎంఎల్సీ తాతా మధు మాట్లాడుతూ వ్యవసాయం నుంచి ఐటీ వరకు ప్రతి రంగంలో కమ్మవారి ముద్ర స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కష్టం అనేది కమ్మ కుల లక్షణమని, అదే ఈ వర్గాన్ని ముందుకు నడిపే శక్తి అని అన్నారు. కార్యక్రమానికి మాజీ ఎంఎల్సీ పొట్ల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, టీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, టీడీపీ రాష్ట్ర నాయకుడు వాసిరెడ్డి రామనాధం, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. వనసమారాధనలో సంప్రదాయబద్ధంగా నిర్వహించిన రుద్రాభిషేకం, దీపారాధన, వనపూజలు పాల్గొన్న వారిని ఆకట్టుకున్నాయి.

వనసమారాధన కార్యక్రమంలో కమ్మ మహాజన సంఘం అధ్యక్షుడు కొల్లు రఘు సత్యనారాయణ, కార్యదర్శి చావా రాము, వైస్ ప్రెసిడెంట్ కర్ణాటి రమాదేవి, జాయింట్ సెక్రటరీ వజ్జా శ్రీనివాసరావు, కోశాధికారి తుళ్లూరి నిర్మలకుమారి, కార్యవర్గ సభ్యులు మోతుకూరి సత్యనారాయణ, తుమ్మలపల్లి నాగేశ్వరరావు, మేదరమెట్ల స్వరూపారాణి, నల్లమల ఆనంద్, నంబూరి సత్యనారాయణ ప్రసాద్, డా. పోతినేని భూమేశ్వర్‌రావు, కోలేటి నవీన్, తాళ్ళూరి మురళీకృష్ణ, బండి రవికుమార్ తదితర సంఘ పెద్దలు పాల్గొన్నారు.



