మునిసిపల్ ఎన్నికల్లో ఓటు చోరీకి కుట్ర..
డబుల్ ఇండ్లు ఓటు బ్యాంకులా మారాయి
మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : జగిత్యాలలో మున్సిపల్ ఎన్నికలకు ముందే ఓటు చోరీకి పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోందని మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. నూకపల్లి అర్బన్ కాలనీలో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు ఓటు బ్యాంకు రాజకీయాలకు కేంద్రంగా మారాయని మీడియా సమావేశంలో మాజీ మంత్రి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అర్బన్ కాలనీలో రెండు కొత్త వార్డులు ఏర్పాటు చేసినా అక్కడి లబ్ధిదారుల పేర్లు మాత్రం జగిత్యాలకు చెందిన దాదాపు అన్ని వార్డుల ఓటర్ లిస్టుల్లో కనిపించడం అనేది స్పష్టమైన ఓటు మేనిప్యులేషన్‌కు నిదర్శనమని మండిపడ్డారు. తాత్కాలికంగా ఎక్కడ ఉంటే అక్కడి ఓటర్ లిస్టులో పేర్లు చేర్చి అసలైన అర్బన్ కాలనీ వార్డులకు మార్చకపోవడం పక్కా రాజకీయ ప్లాన్ అని ఆరోపించారు. వెంటనే ఈ అవకతవకలను సరిచేసి డబుల్ ఇండ్ల లబ్ధిదారుల పేర్లను అర్బన్ కాలనీకి చెందిన వార్డుల ఓటర్ లిస్టుల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ ప్రయోజనాల కోసం మౌలిక వసతులు లేకుండానే ఇళ్లు కేటాయించారని దాదాపు 3,500 మందికి ఇళ్లు మంజూరు చేసినప్పటికీ సగం మంది కూడా ఇప్పటికీ ఇండ్లలోకి ఎందుకు ప్రవేశించలేదని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మౌలిక వసతులు కల్పించినా లబ్ధిదారులు ఇంకా ఇండ్లలోకి చేరకపోవడం అనుమానాస్పదమన్నారు. ఇల్లు లేని నిరుపేదలు అధికారుల చుట్టూ తిరుగుతుంటే ఖాళీగా ఉన్న డబుల్ ఇండ్లను కొందరు కబ్జా చేసుకునేందుకు ప్రయత్నించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అవకతవకలను వెంటనే పరిశీలించి అర్హులైన నిరుపేదలకు ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు


