కండ్లు తెరిచిన అధికారులు…
పారిశుద్ధ్యం బాటలో పంచాయతీ సిబ్బంది
కాకతీయ ఎఫెక్ట్‌తో కమలాపురంలో శుభ్రత పనులు…
కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా మంగపేట మండలంలోని ప్రధాన గ్రామపంచాయతీ కమలాపురంలో నెలల తరబడి పేరుకుపోయిన చెత్తకుప్పలు, పారిశుద్ధ్య లోపాలపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం ఇటీవల కాకతీయ దినపత్రిక శుక్రవారం, శనివారం వరుస కథనాల ద్వారా వెలుగులోకి తీసుకువచ్చింది. పంచాయతీ కార్యదర్శి పట్టింపు లేని ధోరణిపై వచ్చిన ఫోటోలతో కూడిన కథనాలు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో, చివరకు మండల పంచాయతీ అధికారి స్వయంగా స్పందించారు. ఆదివారం ఉదయం కమలాపుర గ్రామంలో పారిశుద్ధ్య పనులను స్వయంగా పర్యవేక్షించిన మండల పంచాయతీ అధికారి శ్రీనివాస్, వెంటనే చెత్తకుప్పలు తొలగించాలని పంచాయతీ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అధికారులు రంగంలోకి దిగడంతో, నెలలుగా పేరుకుపోయిన చెత్త కుప్పలను గ్రామపంచాయతీ పరిసరాల్లో పూర్తిగా తొలగించారు.

గ్రామం నిండా వీధుల వెంట పేరుకుపోయిన చెత్తతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు, ఆదివారం ఉదయం నుంచి శుభ్రత పనులు ముమ్మరం కావడం చూసి హర్షం వ్యక్తం చేశారు. పత్రికలో వచ్చిన వార్తల ప్రభావంతో అధికారులు స్పందించడంతో చివరకు గ్రామం శుభ్రంగా మారడం గ్రామస్తుల్లో నమ్మకం కలిగించింది. పత్రికలో వార్త రాకపోతే మా సమస్యల్ని ఎవరూ పట్టించుకునేవారు కాదు అని, ఇప్పుడు అయినా అధికారులు కదిలినందుకు సంతోషంగా ఉంది అని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు. కమలాపురంలో కొనసాగుతున్న పారిశుద్ధ్య సమస్యలపై కాకతీయ దినపత్రిక వరుస కథనాలు ప్రభావం చూపడంతో గ్రామంలో శుభ్రతకు శుభారంభం అయినట్టు ప్రజలు భావిస్తున్నారు.
కాకతీయ ఎఫెక్ట్ : 


