వికటించిన వైద్యం
అర్షమొలల ఆపరేషన్ ఫెయిల్
ప్రాణాపాయ స్థితిలో యువకుడు
తీవ్ర రక్తస్రావంతో ఎంజీఎంలో మృత్యువుతో పోరాటం
ఇద్దరు నకిలీ వైద్యులపై కేసు నమోదు
కాకతీయ, తెలంగాణ బ్యూరో: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చింత నెక్కొండ గ్రామానికి చెందిన మాడూరు రజనీకాంత్ అనే యువకుడు అర్ష మొలల సమస్యతో బాధపడుతున్నాడు. నర్సంపేట దగ్గరలోని మంగళవారిపేట గ్రామంలో కౌసల్య అనే వృద్దురాలు, చిట్టిబాబు అనే ఆర్ఎంపీ ఇద్దరూ కలిసి ఈనెల 13న ఆపరేషన్ నిర్వహించారు. వైద్యం వికటించి అదే రోజు రాత్రి విపరీతమైన రక్త స్రావం అయింది. హైపో వోలెమిక్ షాక్ తో ఎంజీఎం దవాఖానలో రాత్రి 11గంటలకు ప్రాణాపాయ స్థితిలో చేరాడు. జనరల్ సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ నాగేందర్ ఆధ్వర్యంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డా రూప, డా కార్తిక్, పీజీ వైద్యులు శరణ్ మరో ఆపరేషన్ నిర్వహించి రక్తస్రావాన్ని నియంత్రించారు. ఇప్పటికీ పరిస్థితి ఇంకా క్లిష్టంగా ఉన్నట్టు వైద్యులు తెలియ చేశారు. సంఘటనపై భాధితుడి తల్లి ఫిర్యాదు మేరకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ పబ్లిక్ రిలేషన్స్ కమిటీ చైర్మన్ డా నరేష్ కుమార్ వేములపల్లి, జిల్లా యాంటీ క్వాకరీ కమిటీ సభ్యులు డా ఎం. దిలీప్ కుమార్ భాధితుడిని పరామర్శించి ఘటన వివరాలు సేకరించారు.
9154382727 కి కంప్లైంట్ చేయండి
వైద్యపరంగా అర్హత లేని వ్యక్తులు రూరల్ మెడికల్ ప్రాక్టిషనర్స్/ఆర్ఎంపీలు వైద్యులుకారని
నమ్మి మోసపోవద్దని వారికి అల్లోపతి వైద్య చికిత్స, ల్యాబ్ టెస్టులు, ఆపరేషన్ చేసే అనుమతి ఉండదన్నారు. వారు ఇచ్చే ఆశాస్త్రీయ చికిత్సలతో సమస్య మరింత జటిలం అవుతుందని, క్వాలిఫైడ్ వైద్యుల వద్ద గవర్నమెంట్ హాస్పిటల్‌లోనే చికిత్స తీసుకోవాలని ప్రజలకు సూచించారు. మంగళవారుపేటలో నకిలీ వైద్యులు కౌసల్య, చిట్టిబాబుపై విచారణ జరిపి కేసు నమోదు చేస్తామని తెలియ చేశారు. ప్రజారోగ్య పరిరక్షణ, ఆరోగ్య తెలంగాణ సాధించేందుకు నకిలీ వైద్యులపై నిరంతర తనిఖీలు కొనసాగుతాయని, నకిలీ వైద్యులపై కంప్లైంట్ కోసం 9154382727 కి వాట్సాప్ ద్వారా తెలియచేయాలని డా నరేష్ కుమార్ కోరారు.


