మానసిక ఉల్లాసంతో ఆరోగ్యం..
ఖమ్మం సీటీసీ అడిషనల్ డీసీపీ విజయ్‌బాబు
విహార యాత్రకు వెళ్లిన తలసేమియా చిన్నారులు
కాకతీయ, ఖమ్మం: ప్రతి వ్యక్తి మానసిక ఉల్లాసంతో జీవిస్తే ఆరోగ్యవంతులుగా ఉంటారని సీటీసీ అడిషనల్ డీసీపీ ఇ. విజయ్‌బాబు అన్నారు. శనివారం సంకల్ప స్వచ్ఛంద సేవాసంస్థ ఆధ్వర్యంలో తలసేమియా చిన్నారులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల బీచ్ విహారయాత్రకు తీసుకెళ్లారు. బీచ్ వద్ద చిన్నారులకు సదుపాయాలు కల్పించిన అడిషనల్ డీసీపీ మాట్లాడుతూ తలసేమియా చిన్నారుల ఆరోగ్యంతోపాటు వారిలో ఉత్సాహాన్ని నింపేందుకు సంకల్ప చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు. చిన్నారులకు తమ లోపాన్ని గుర్తు చేయకుండా నిత్యం సరదాగా సాధారణ వ్యక్తుల్లా గడిపేలా తల్లిదండ్రులు వ్యవహరించాలని సూచించారు. చిన్నారుల కోసం సేవా కార్యక్రమాలతోపాటు వారి అవసరాలను గుర్తించి తీరుస్తున్న సంకల్పకు ప్రతి ఒక్కరూ అండగా నిలబడాలని కోరారు. చిన్నారులతో ఒకరోజు సరదాగా గడపడం మానసిక తృప్తిని ఇచ్చిందని, వీరి కోసం తన వంతుగా సంకల్పతో కలిసి మరిన్ని కార్యక్రమాలు చేపడతానని హామీ ఇచ్చారు. సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఫౌండర్ అనిత మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సంస్థ ఆధ్వర్యంలో చిన్నారులను విహార యాత్రలకు తీసుకెళ్తుంటామని అన్నారు. చిన్నారులు బీచ్ లో సరదాగా గడపడం తమకు చాలా తృప్తినిస్తుందని, వారిని సంతోషంగా ఉంచడం తమ సంస్థ లక్ష్యమని అన్నారు. బీచ్ వద్ద చిన్నారులకోసం సౌకర్యాలు కల్పించిన అడిషనల్ డీసీపీ విజయ్‌బాబు కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షురాలు పి.పావని, బాధ్యులు పి.రవిచందర్, పి.ఉదయ్‌భాస్కర్, పి.వంశీకిరిటి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


