ఇడెన్ గార్డెన్స్‌లో జడేజా అరుదైన రికార్డు..లెజెండ్స్ లిస్ట్‌లో చోటు!
ఇడెన్ గార్డెన్స్‌లో జడేజా కొత్త మైలురాయి
4000 పరుగులు–300 వికెట్లతో అరుదైన ఘనత
లెజెండ్ల సరసన చేరిన భారత ఆల్‌రౌండర్
కాకతీయ, స్పోర్ట్స్ : భారత క్రికెట్‌కి అగ్రశ్రేణి ఆల్‌రౌండర్‌గా నిలిచిన రవీంద్ర జడేజా టెస్టు క్రికెట్‌లో మరో అరుదైన రికార్డును సాధించాడు. దక్షిణాఫ్రికాతో ఇడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆటలో జడేజా తన ఇన్నింగ్స్‌లో 10వ పరుగు పూర్తి చేసిన క్షణమే 4000 టెస్ట్ పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. దీనితో పాటు ఇప్పటికే 300కు పైగా వికెట్లు తన ఖాతాలో ఉండటంతో, టెస్ట్ చరిత్రలో ఈ రెండు ఘనతలను సాధించిన అరుదైన ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు.
4000 పరుగులు, 300 వికెట్లు అనే ఈ ప్రత్యేక రికార్డు ఇప్పటి వరకు కేవలం ముగ్గురు దిగ్గజాలకే దక్కింది. ఇయాన్ బోథమ్, కపిల్ దేవ్, డానియల్ వెటోరి. ఇప్పుడు ఆ లెజెండ్స్‌లో నాలుగో వ్యక్తిగా జడేజా ఎంట్రీ ఇచ్చాడు. ఈ రికార్డు జడేజా స్థాయిని ప్రపంచానికి మరోసారి చూపిస్తోందని చెప్పాలి. జడేజా ఈ మైలురాయిని చేరడానికి కేవలం 87 టెస్టులు మాత్రమే పట్టాయి. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా ఈ రికార్డును సాధించిన ఆటగాడు ఇయాన్ బోథమ్ (72 టెస్టులు). అతని తరువాతి స్థానంలో జడేజా నిలవడం అతడి స్థిరత, నైపుణ్యాన్ని మరింత స్పష్టంగా చూపిస్తుంది.
ఇప్పటివరకు జడేజా తన టెస్ట్ కెరీర్‌లో 6 సెంచరీలు, 27 అర్ధ సెంచరీలు, 331 వికెట్లు సాధించాడు. బ్యాటింగ్‌లో సహనం, ఆత్మవిశ్వాసం.. బౌలింగ్‌లో వైవిధ్యం, కచ్చితత్వం.. ఫీల్డింగ్‌లో మెరుపువేగం, చురుకుతనం.. జడేజాను సంపూర్ణ ఆటగాడిగా నిలబెడుతున్నాయి. కపిల్ దేవ్ తర్వాత నిజమైన ఆల్‌రౌండర్ కోసం భారత్ చాలా కాలం ఎదురుచూసింది. జడేజా ఆ లోటును భర్తీ చేసేశారు. తనదైన మార్క్‌తో ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన ఆల్‌రౌండర్లలో ఒకరిగా గుర్తింపు పొందాడు.


