సామాజిక సేవలో ఆదర్శ దంపతులు
దేవాలయాలు, స్మశాన వాటికల అభివృద్ధికి ముప్పై లక్షల రూపాయల విరాళం
కాకతీయ, ఖిలావరంగల్ : ఖిలావరంగల్ తూర్పుకోటకు చెందిన నలివెల రవీందర్, జయ దంపతులు దాతృత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు. తమ కూతురు కీ.శే సహజ, తండ్రి కీ.శే హనుమంతుల జ్ఞాపకార్థం మొత్తం ముప్పై లక్షల రూపాయలకు పైగా ఖర్చు చేసి ప్రజాహితానికి సేవలందిస్తున్నారు.
తూర్పుకోట పోచమ్మ గుడి ఆవరణలో ఐదులక్షల రూపాయల వ్యయంతో రేకుల షెడ్డు నిర్మించారు. అలాగే హనుమాన్ గుడి వద్ద నాలుగు లక్షలతో మరో షెడ్డు ఏర్పాటు చేశారు. చింతల్ ఫ్లైఓవర్ సమీపంలోని మైసమ్మ గుడి వద్ద ఐదులక్షలతో మరొక షెడ్డు నిర్మాణం చేపట్టారు.
ఇదివరకు తూర్పుకోట హిందూ స్మశాన వాటికలో ఒక లక్ష రూపాయలతో గేట్ నిర్మించి స్థానికుల ప్రశంసలు పొందారు.
దేవాలయాల అభివృద్ధికే కాకుండా, భక్తుల సౌకర్యం కోసం కూడా ఈ దంపతులు ముందుకొస్తున్నారు. తెలంగాణ సుప్రసిద్ధ దేవాలయం వేములవాడలో కాటేజీ రూమ్ నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చును భరించి, రాజన్న దర్శనానికి వెళ్లే వారికి ఆ రూమ్ వినియోగానికి అవసరమైన లెటర్ అందించి, ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకునేలా చేస్తున్నారు.
తమ సేవా కార్యక్రమాలతో నలివెల రవీందర్–జయ దంపతులు ఖిలావరంగల్ ప్రజల్లో విశేష అభినందనలు పొందుతున్నారు.



