మామునూర్ ఎయిర్ పోర్టు భూసేకరణ పనుల పరిశీలన
ఎయిర్పోర్ట్ భూసేకరణలో జాప్యం జరగకూడదు
వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య
కాకతీయ, వరంగల్ ప్రతినిధి: ఓరుగల్లు ప్రజల విమానాశ్రయం కల త్వరలోనే నెరవేరబోతోందని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య స్పష్టం చేశారు.
మామునూర్ ఎయిర్ రన్ వే విస్తరణ పనులను గురువారం రోజున ఎంపీ డాక్టర్ కడియం కావ్య, జిల్లా కలెక్టర్ సత్య శారదతో కలసి పరిశీలించారు. పనుల సమర్ధ నిర్వహణకు ఇరిగేషన్, ఆర్ అండ్ బి అధికారులకు pal సూచనలు చేశారు.
ఈ. సందర్భంగా నక్కల పల్లి చెరువు, గాడిపల్లి చెరువులతో పాటు ఎయిర్ పోర్ట్ కు వెళ్ళే రోడ్లను సందర్శించి పరిశీలించారు. ప్రస్తుత వర్షపాతాన్ని దృష్టిలో ఉంచుకొని ఎయిర్పోర్ట్ పరిధిలో చేపట్టబోయే నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. మామునూరు ఎయిర్పోర్ట్. భూ సేకరణకు సంబంధించిన పనుల్లో జాప్యం లేకుండా చూడాలని అధికారులకు ఎంపీ సూచించారు.
అనంతరం అధికారులు మ్యాప్ ద్వారా రన్ వే విస్తరణ పనులను ఎంపీకు వివరించారు.ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో విమనాశ్రయం పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. మామునూరులో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు ప్రణాళిక రూపకల్పన చేయడం జరిగిందని అన్నారు. ప్రయాణికుల సేవలతో పాటు కార్గో సేవలను సైతం అందించేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు. వరంగల్‌ను రాష్ట్ర రెండో రాజధానిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని అన్నారు. కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు పక్కనే ఉన్నందున ఎయిర్ పోర్ట్ సర్వీసులు ప్రారంభమైతే వరంగల్ ప్రగతి లో దూసుకుపోతుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ ఈఈ రాజేందర్, ఇరిగేషన్ డీఈ మధుసూదన్ రెడ్డి, తహసీల్దార్ ఇక్బాల్ అహ్మద్, ఏఈ రాజశేఖర్, సర్వేయర్ రజిత తదితరులు పాల్గొన్నారు.


