దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
గీసుగొండ సీఐ డి.విశ్వేశ్వర్
కాకతీయ, గీసుగొండ: దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గీసుగొండ సీఐ డి. విశ్వేశ్వర్ విజ్ఞప్తి చేశారు. ఇటీవల గీసుగొండ మండల పరిధిలోని కొన్ని గ్రామాల్లో చోటుచేసుకున్న దొంగతనాల నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యమని, ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల భద్రతా చర్యల పట్ల నిర్లక్ష్యం వహించరాదని ఆయన హెచ్చరించారు.రాత్రి వేళల్లో ఇళ్ల తలుపులు, కిటికీలను బిగించి మూసి ఉంచాలని, ఇంటి ముందు మరియు వెనుక భాగాల్లో లైట్లు వెలిగించి ఉంచాలని సీఐ సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు గమనించిన వెంటనే గీసుగొండ పోలీస్ స్టేషన్ లేదా డయల్ 100కు సమాచారం ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు.
ఇళ్లలో బంగారు నగలు, నగదు వంటి విలువైన వస్తువులను నిల్వ చేయకుండా సురక్షిత ప్రదేశాల్లో భద్రపరచాలని, ఇళ్ల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా దొంగతనాలను ముందుగానే అరికట్టవచ్చని సీఐ తెలిపారు.అలాగే గ్రామాల యువత అప్రమత్తంగా ఉండి, తెలియని వ్యక్తులు లేదా వాహనాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు.ప్రజల సహకారమే నేరాల నివారణకు ప్రధాన బలమని, ప్రజల సేవకై గీసుగొండ పోలీసులు ఎల్లపుడూ సిద్ధంగా ఉన్నారని గీసుగొండ సీఐ డి. విశ్వేశ్వర్ తెలిపారు.


