అలా చేస్తేనే ఇండియా జట్టులో స్థానం..
విరాట్-రోహిత్‌కు బీసీసీఐ అల్టిమేటం!
విరాట్, రోహిత్‌పై బీసీసీఐ ప్రెజర్
వన్డేల్లో ఆడాలంటే దేశీయ క్రికెట్ తప్పనిసరి
విజయ్ హజారే ట్రోఫీలో రోహిత్ శర్మ రీ-ఎంట్రీ కన్ఫర్మ్
విరాట్ కోహ్లీ నిర్ణయం ఇంకా సస్పెన్స్‌లోనే
కాకతీయ, స్పోర్ట్స్ : టీమిండియా సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్టులు, టీ20ల నుండి రిటైర్ అయిన సంగతి తెలిసిందే. ఈ జంట ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. చివరిసారిగా ఆస్ట్రేలియాలో కలిసి ఆడిన విరాట్-రోహిత్‌లను మళ్లీ భారత జెర్సీలో చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 6 వరకు దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌లో వీరిద్దరూ యాక్షన్‌లోకి రానున్నారు. అయితే, అంతకన్నా ముందే బీసీసీఐ నుండి ఇద్దరికీ ఒక స్పష్టమైన అల్టిమేటం వెళ్లింది.
భారత జట్టులో కొనసాగాలంటే దేశీయ క్రికెట్ ఆడాల్సిందే అంటూ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు బీసీసీఐ స్పష్టమైన సందేశం పంపింది. భారత జట్టులోని సీనియర్ క్రికెటర్లుగా ఉన్న రోహిత్, విరాట్‌లు టీమ్‌కి నిరంతర సహకారం అందించాలంటే మ్యాచ్ ప్రాక్టీస్ తప్పనిసరి అని బీసీసీఐ అభిప్రాయం. క్లబ్ స్థాయిలో అయినా, దేశీయ టోర్నీల్లో అయినా క్రమం తప్పకుండా ఆడితేనే ఫిట్‌నెస్, రిథమ్ కొనసాగుతుందని బోర్డు భావిస్తోంది. టెస్ట్, టీ20 ఫార్మాట్లకు రిటైర్మెంట్ చెప్పినందున ఇండియా జట్టులో స్థానం కొనసాగాలంటే దేశవాళీలో ఆడాల్సిందే అని బీసీసీఐ పేర్కొంది.
ఈ నిర్ణయాన్ని గౌరవిస్తూ రోహిత్ శర్మ వెంటనే యాక్షన్‌లోకి దిగాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA)కి తాను విజయ్ హజారే ట్రోఫీ కోసం అందుబాటులో ఉంటానని తెలియజేశాడు. డిసెంబర్ 24 నుండి జనవరి 8 వరకు జరిగే గ్రూప్ దశలో రోహిత్ పూర్తి స్థాయిలో పాల్గొనవచ్చని సమాచారం. అనంతరం జనవరి 11 నుండి ప్రారంభమయ్యే న్యూజిలాండ్ సిరీస్‌లో భారత జెర్సీతో మళ్లీ మైదానంలోకి దిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ముంబైలోని శరద్ పవార్ ఇండోర్ అకాడమీలో రోహిత్ శర్మ కఠినంగా శిక్షణ తీసుకుంటున్నాడట. అంతేకాదు, నవంబర్ 26 నుంచి ప్రారంభమయ్యే సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ 2025లో కూడా ఆడే ఆలోచనలో రోహిత్ ఉన్నాడని సమాచారం.
ఇక విరాట్ కోహ్లీ విషయంలో మాత్రం ఇంకా స్పష్టత లేదు. ఢిల్లీ తరపున విజయ్ హజారే ట్రోఫీ ఆడతాడా లేదా అనేది ఇంకా తేలాల్సి ఉంది. అయితే బోర్డు నుంచి వచ్చిన స్పష్టమైన సిగ్నల్ తర్వాత, కోహ్లీ కూడా త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. రోహిత్ ఇప్పటికే సన్నద్ధమవుతుండగా, కోహ్లీ ఏం నిర్ణయం తీసుకుంటాడో అని క్రికెట్ అభిమానులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


