అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో ఘనంగా ‘ఖేల్ ఉత్సవ్’
కాకతీయ, కరీంనగర్: అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో ‘ఖేల్ ఉత్సవ్’ను ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో క్రీడాస్పూర్తి పెంపొందించడంతోపాటు, వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడమే ఉత్సవ లక్ష్యమని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా. వి. నరేందర్ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ప్రధాన అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ నైపుణ్యం సాధించాలని, పాఠశాల స్థాయిలోనే శిక్షణ అందిస్తూ ఉన్నత స్థాయి పోటీలకు ఎంపిక చేసేలా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయుల ద్వారా క్రమం తప్పకుండా శిక్షణ ఇస్తున్నామని తెలిపారు.వార్షిక ప్రణాళికలో భాగంగా నిర్వహించిన ఈ ఉత్సవంలో ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, త్రో బాల్, నెట్‌బాల్, ఖోఖో, కబడ్డి, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, చెస్ తదితర క్రీడాపోటీలను నిర్వహించారు.ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బాలల దినోత్సవం సందర్భంగా బహుమతులు ప్రదానం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.



