ఢిల్లీ బ్లాస్ట్ కుట్రలో కొత్త మలుపు..జనవరి 26న మరో దాడికి ప్లాన్..!
దీపావళికే దాడి చేయాలని ప్లాన్ చేసిన నిందితులు
ముజామ్మిల్ మొబైల్ డేటాలో బయటపడ్డ రహస్యాలు
జనవరి 26న మరో దాడి ప్రణాళిక
కాకతీయ, జాతీయం : దేశ రాజధానిని కుదిపేసిన ఎర్రకోట పేలుడు ఘటన ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంది. సోమవారం ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన కారు పేలుడులో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్వాత భద్రతా వ్యవస్థ అంతటా అలర్ట్ మోగింది. మొదట ఈ ఘటనను యాదృచ్ఛిక ప్రమాదమని భావించిన పోలీసులు, ఇప్పుడు దీన్ని ఒక పూర్తిస్థాయి ఉగ్రదాడి కుట్రగా గుర్తించారు. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధాన నిందితుడు ముజామ్మిల్, విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడించాడు. అతను అధికారులకు తెలిపిన వివరాల ప్రకారం, అతని టీమ్ మొదట దీపావళి సందర్భంగా ఢిల్లీలో అత్యంత రద్దీగా ఉండే ప్రదేశాల్లో దాడి చేయాలని నిర్ణయించిందట. రద్దీ గల షాపింగ్ ఏరియాలు, మార్కెట్లు, మరియు మెట్రో స్టేషన్లు వారి టార్గెట్ లిస్ట్‌లో ఉన్నాయని సమాచారం. అయితే చివరి నిమిషంలో దానిని అమలు చేయడంలో విఫలమైనట్టు పేర్కొన్నాడు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు ముజామ్మిల్, ఫరిదాబాద్‌లోని ఆల్-ఫలాహ్ విశ్వవిద్యాలయంలో వైద్యుడిగా పనిచేశాడు. అదే యూనివర్సిటీలో అతనితో కలిసి పనిచేసిన ఉమర్, దాడి ప్రణాళికలో భాగమని అధికారులు చెబుతున్నారు. ఉమర్ ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారులో బాంబు పేలడంతో మృతిచెందాడు. ముజామ్మిల్ చెప్పిన వివరాల ప్రకారం, ఉమర్‌తో కలిసి అతడు దాడి ప్రదేశాన్ని ముందే స్వాధీనం చేసుకున్నారని సమాచారం.
తదుపరి టార్గెట్ జనవరి 26..
దీపావళి ప్లాన్ విఫలమైన తర్వాత, నిందితులు వచ్చే ఏడాది జనవరి 26 (రిపబ్లిక్ డే) న మరో పెద్ద దాడి జరపాలని నిర్ణయించుకున్నారని విచారణలో తేలింది. ఎర్రకోట చుట్టుపక్కల ప్రాంతాలను టార్గెట్‌గా ఎంచుకున్నట్టు ముజామ్మిల్ తెలిపాడు. జనవరి 26న రాజధానిలో అధిక భద్రతా వాతావరణం ఉండటం వల్ల ఈ దాడి ప్లాన్ సాధ్యమా కాదా అన్నది వారి మధ్య చర్చించుకున్నారని విచారణలో వెల్లడైంది. ముజామ్మిల్ మొబైల్ ఫోన్, సోషల్ మీడియా అకౌంట్లు, కాల్ రికార్డులు పరిశీలించగా అనేక సందేహాస్పద చాట్‌లు, లొకేషన్ హిస్టరీలు బయటపడ్డాయి. అతను మరియు ఉమర్ కలసి ఎర్రకోట పరిసరాల్లో పలు సార్లు రిక్కీ చేసినట్లు GPS డేటా ద్వారా నిర్ధారణ అయ్యింది. ఈ సమాచారంతో మరికొందరు వ్యక్తులు కూడా ఈ దాడి ప్రణాళికలో భాగమై ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ముజామ్మిల్ ప్రస్తుతం కస్టడీలోనే ఉన్నాడు. అతడి ద్వారా సేకరించిన ఆధారాలతో పాటు, ఉమర్ మరణానికి ముందు ఉన్న కాల్ లాగ్‌లు, వాహన రికార్డులు, మరియు ఫైనాన్షియల్ లావాదేవీలను పోలీసులు విచారిస్తున్నారు. అదేవిధంగా ఢిల్లీ బ్లాస్ట్ ఘనట అనంతరం అధికారలు ఎర్రకోట పరిసరాల్లో, మెట్రో స్టేషన్ల వద్ద, ముఖ్యంగా రిపబ్లిక్ డే సన్నాహాల నిమిత్తం మరింత కఠిన భద్రతా చర్యలు అమలు చేస్తున్నారు.


