కట్టరాంపూర్ రోడ్డుపై మహిళల ధర్నా
రోడ్డు బాగు చేయకపోతే ఆందోళనలు తప్పవని హెచ్చరిక
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగరంలోని కట్టరాంపూర్ ప్రాంతంలో బుధవారం మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కట్టరాంపూర్ నుంచి కోతిరాంపూర్ వరకు ఉన్న రహదారి పూర్తిగా ధ్వంసమైందని, గుంతలతో నిండిపోయి రోజూ ప్రమాదాలు జరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మార్గం ద్వారా విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు ప్రతిరోజూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. పలు సార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లభించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.రోడ్డు మరమ్మతు చేయాలని డిమాండ్ చేస్తూ మహిళలు రోడ్డుపైకి వచ్చి ధర్నా నిర్వహించారు. దీంతో ఆ ప్రాంతంలో కొంతసేపు ట్రాఫిక్ స్తంభించింది. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని మహిళలను సముదాయించారు. ప్రజల సమస్యలపై అధికారులు వెంటనే స్పందించి రోడ్డును తక్షణమే బాగు చేయాలని మహిళలు గళమెత్తారు.మేము ప్రతిరోజూ ఈ రోడ్డుపైనే వెళ్తాం గుంతల్లో జారిపడి పిల్లలు పడిపోతున్నారు. ఇక మాకు భద్రత కావాలి అంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.


