17% లోపు తేమ వచ్చాకే ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలి
కలెక్టర్ కోయ శ్రీ హర్ష
నాణ్యమైన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలింపు
రైతులకు సూచనలు
కాకతీయ, పెద్దపల్లి : రైతులు ధాన్యాన్ని సరైన రీతిలో ఆరబెట్టి తేమ శాతం 17% లోపు ఉన్న తర్వాత మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. కలెక్టర్ బుధవారం ప్రకటనలో మాట్లాడుతూ వరి కోతల అనంతరం పొలం నుండి నేరుగా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకురావద్దని, ముందుగా బాగా ఆరబెట్టాలని రైతులకు సూచించారు.తేమ శాతం 17% లోపుగా ఉండే వరకు ధాన్యాన్ని ఆరబెట్టాలి. తేమ ఎక్కువగా ఉంటే కాంటా ప్రక్రియ ఆలస్యమవుతుంది. 4-5 రోజుల తర్వాత మాత్రమే కొలతలు వేయాల్సి వస్తుంది అని కలెక్టర్ పేర్కొన్నారు.నాణ్యమైన ధాన్యం తీసుకొచ్చిన రైతుల ధాన్యం ముందుగా కొనుగోలు చేయడం సహజమని తెలిపారు.మన కంటే వెనుక వచ్చిన వారి ధాన్యం ముందుగా కొనుగోలు చేస్తున్నారని ఫిర్యాదు చేయడం వల్ల ప్రయోజనం ఉండదు అని వివరించారు.రోజంతా ఆరబెట్టిన ధాన్యాన్ని రాత్రిపూట ప్లాస్టిక్ కవర్లతో కప్పుకోవాలని, లేకపోతే రాత్రి తేమ కారణంగా తేమ శాతం పెరిగే అవకాశం ఉందని సూచించారు.రైతులు బాగా ఆరిన ధాన్యాన్ని తీసుకురాగానే అదే రోజు కాంటా వేసి, మిల్లులకు తరలిస్తాం అని కలెక్టర్ తెలిపారు. రైతులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ముందుగానే ధాన్యాన్ని ఆరబెట్టి కేంద్రాలకు తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


