జూబ్లీహిల్స్ హస్తగతం
ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన సర్వే సంస్థలు
అన్నింట్లోనూ అధికార పార్టీకి స్పష్టమైన ఆధిక్యం
రెండోస్థానంలో బీఆర్ఎస్.. పోటీ ఇవ్వని బీజేపీ
ప్రశాంతంగా ముగిసిన ఉప ఎన్నిక పోలింగ్
సాయంత్రం 5 గంటల వరకు 47.16 శాతం పోలింగ్
పలుచోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం
ఈనెల 14న ఫలితాలు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ వచ్చేశాయి. దాదాపు అన్ని సర్వే సంస్థలూ అధికార పార్టీకి జై కొట్టాయి. కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని ఎక్కువ సర్వే సంస్థలు చెబుతున్నాయి. చాణక్య స్టేటజీస్ సంస్థ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని తెలిపింది. కాంగ్రెస్‌కు 46 శాతం, బీఆర్ఎస్ కు 41 శాతం అలాగే బీజేపీకు 06 శాతంగా అంచనా వేసింది. పీపుల్స్ పల్స్ సంస్థ.. కాంగ్రెస్ 48 శాతం, బీఆర్ఎస్ 41 శాతం, బీజేపీ 06 శాతం అని తేల్చింది. అలాగే స్మార్ట్ పోల్ సంస్థ అంచనాలను చూస్తే.. కాంగ్రెస్ 48.2 శాతం అలాగే బీఆర్ఎస్ 42.1 శాతం ఇక బీజేపీ 06 శాతం ఓట్లు వచ్చినట్లు స్పష్టం చేసింది. నాగన్న సర్వే వివరాలు చూస్తే.. కాంగ్రెస్ కు 47 శాతం ఓట్లు వచ్చినట్లు తేల్చింది. బీఆర్ఎస్ కు 41 శాతం, బీజేపీ కు 08 శాతం ఓట్లు పడినట్లు అంచనా వేసింది. జన్ మైన్ సర్వే కూడా కాంగ్రెస్ పార్టీకే అధికారం కట్టబెట్టింది. పబ్లిక్ పల్స్ (శ్రీనివాస్) సర్వే.. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని పేర్కొంది. ఉదయం నుంచి వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యం ఉన్నట్లు సర్వేలు తేల్చి చెప్పాయి. మొత్తంగా జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తోంది.
ప్రధాన పార్టీల హోరాహోరీ
2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి విజయం సాధించిన మాగంటి గోపినాథ్ ఆకస్మిక మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్ని బరిలో 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బీఆర్ఎస్ నుంచి గోపినాథ్ సతీమణి సునీత, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి ఎల్ దీపక్ రెడ్డిలు బరిలో నిలిచారు. ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ తమ మద్దతు బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి ఉంటుందని ప్రకటించింది. ఇక, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు ఎంఐఎం మద్దతు ఇచ్చింది.
50 శాతం పోలింగ్ దాటే అవకాశం
జూబ్లీహిల్స్ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 వరకు 47.16 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటలలోపు క్యూ లైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. జూబ్లీహిల్స్ చరిత్రను పరిశీలిస్తే.. ఇక్కడ పోలింగ్ శాతం ఎప్పుడూ తక్కువగా ఉంటుంది. గత ఎన్నికల్లో (2023) 47.58% ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఈ ఉప ఎన్నికలో పోలింగ్ సుమారుగా 50 శాతానికిపైగా నమోదు అవ్వనున్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఎన్నికల అధికారులు వివరాలు వెల్లడించాల్సి ఉంది. ఇక, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరగనుంది.
బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య వాగ్వాదం
అయితే పోలింగ్ సందర్బంగా కొన్నిచోట్ల బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత అధికార కాంగ్రెస్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ నేతలు నిబంధనలు ఉల్లంఘించి దొంగ ఓట్లు వేయిస్తున్నారని, దొంగ ఓటర్లకు పోలీసులు సహకరిస్తున్నారని ఆరోపించారు. తాము దొంగ ఓటర్లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ రౌడీ షీటర్లతో దౌర్జన్యాలకు పాల్పడుతుందని సంచలన ఆరోపణలు చేశారు. తమ పార్టీ కార్యకర్తలను కొట్టి, తిరిగివారి మీదనే కేసులు పెడతామని కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ఆరోపణలను కాంగ్రెస్ ఖండించింది. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… ‘‘జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రజాస్వామ్యంగా జరగాలని ఆకాంక్షించే పార్టీ కాంగ్రెస్. బీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోతున్నామని అసహనంతో మూడు రోజులుగా ఏది పడితే అది మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
మొబైల్ స్క్కాడ్‌లు.. డ్రోన్ నిఘా..
జూబ్లీహిల్స్ నియోజవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 2,08,561, మహిళలు 1,92,779, ఇతరులు 25 మంది ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం మొత్తంగా 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఇందులో 11 స్టేషన్‌లో 1,200 మంది కంటే ఎక్కువ మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించనున్నారు. గరిష్టంగా పోలిగ్ స్టేషన్ 9 పరిధిలో 1,233 మంది ఓటర్లు, కనిష్టంగా పోలింగ్ స్టేషన్ 263 పరిధిలో 540 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు 19 మంది నోడల్ అధికారులను, 38 మంది సెక్టార్ అధికారులను నియమించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రశాంతంగా నిర్వహించేందుకు భారీగా భద్రత చర్యలు చేపట్టారు. 1,700కు పోలీసు సిబ్బంది, 8 కంపెనీలు సీఐఎస్‌ఎఫ్ సిబ్బందిని మోహరించారు. ఓటింగ్ సజావుగా జరిగేలా చూసేందుకు మొబైల్ స్క్వాడ్‌లు, డ్రోన్ నిఘాను కూడా ఉపయోగించారు.


