అంగన్వాడీ చిన్నారులను సొంత పిల్లలుగా చూసుకోవాలి
కేంద్రాలను అత్యుత్తమంగా తీర్చిదిద్దాలి అదనపు కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే
కాకతీయ, కరీంనగర్ : అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులను తమ సొంత పిల్లలుగా భావించి సేవలు అందించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే సూచించారు.మంగళవారం తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణ కాలనీ అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా చిన్నారుల బరువు, హాజరు రిజిస్టర్లు పరిశీలించి, ప్రీ స్కూల్ పిల్లలతో ముచ్చటిస్తూ వారి ఆక్టివిటీలను గమనించారు.జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆధ్వర్యంలో జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు చక్కగా పనిచేస్తున్నాయని ఆమె ప్రశంసించారు. విద్యార్థులను ఆకట్టుకునే రీతిలో కేంద్రాల నిర్వహణ ఉండాలని, చిన్నారులు, గర్భిణీలు, బాలింతలు ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.అంగన్వాడీ కేంద్రాలు విద్యారంగానికి తొలి మెట్టుగా ఉంటాయని, వీటి పనితీరు మెరుగ్గా ఉంటే పాఠశాలలు కూడా అభివృద్ధి చెందుతాయని ఆమె పేర్కొన్నారు. పిల్లలకు పౌష్టికాహారం సమృద్ధిగా అందించాలన్నారు.తరువాత ప్రాథమిక పాఠశాలను పరిశీలించిన అదనపు కలెక్టర్ విద్యార్థుల సామర్థ్యాలను గమనించి, తాగునీటి సదుపాయం, కిచెన్‌షెడ్ తదితర సౌకర్యాలను పరిశీలించారు. గ్రామంలో పారిశుద్ధ్య పనులను పకడ్బందీగా నిర్వహించాలని, మురుగు కాలువల్లో చెత్తాచెదారం పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు.దోమల వ్యాప్తి నివారణ, వ్యాధుల నియంత్రణపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


