దేవాదుల ప్రాజెక్ట్ ద్వారా సాగునీరును అందిస్తాం
ప్రభుత్వానికి అత్యంత ప్రాముఖ్యమైన ప్రాజెక్టు.. దేవాదుల
దేవాదుల ప్రాజెక్ట్ తో రాష్ట్రంలోని 17 నియోజకవర్గాలకు సాగునీరు అందిస్తాం
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క మల్లు

కాకతీయ, ములుగు ప్రతినిధిః కాకతీయ, ములుగు : దేవాదుల ప్రాజెక్ట్ ప్రభుత్వానికి అత్యంత ప్రాముఖ్యమైన ప్రాజెక్ట్ అని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఆదివారం ములుగు జిల్లా కన్నాయీగూడెం మండలం దేవాదుల ప్రాజెక్ట్ ప్రాంగణంలో జె. చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్ట్ పనుల పురోగతిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాదుల ప్రాజెక్ట్ ద్వారా పదిహేడు నియోజకవర్గాల పరిధిలోని ఆయకట్టుకు నీరందిస్తామన్నారు. ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు. 67 కోట్ల తో భూసేకరణ చేపట్టనున్నామన్నారు. దశల వారీగా నిధులను విడుదల చేసి 71 మీటర్ల తో నిర్మించనున్నట్లు వివరించారు. ప్రాజెక్టు భూసేకరణకు సంబంధించి, పెండింగ్ బిల్లులు కలిపి మొత్తం వంద కోట్ల రూపాయలు ఉన్నాయని, విడతాలవారీగా నిధులు విడుదల చేస్తామన్నారు. ఇందుకు సంభందించిన వివరాలను అధికారులు వెంటనే పంపాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు రాకుండా ఏడాదిలో రెండు సీజన్లకు సాగు నీటిని ఈ ప్రాజెక్టు ద్వారా అందించనున్నందున తగిన విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రాజెక్టు మొదలు పెట్టినప్పుడు ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా నిర్మాణం చేపట్టినా.. ప్రస్తుతం ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తోందన్నారు. సాగు నీటి ఆయకట్టు ఇంకా పెరిగే అవకాశం ఉన్నందున, ఈ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. గతంలో 38 టీఎంసీల స్సామర్థ్యం ఉండగా తాజాగా 78 నుంచి 80 టీఎంసీల అవసరం అవుతుందన్నారు.
అన్ని సమస్యలు పరిష్కరిస్తాం : మంత్రి ఉత్తమ్
సాగునీటిపారుదల, పౌర సరాఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ దేవాదుల ప్రాజెక్ట్ అన్ని దశలను పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఛత్తీస్ గడ్ ప్రభుత్వ సాగునీటి పారుదల శాఖ మంత్రి కశ్యప్ తో చర్చలు జరుపుతున్నామని పేర్కొన్నారు. ఆ రాష్ట్ర పరిధిలోని ముంపు ప్రాంతాలకు పరిహారం చెల్లించేందుకు మాట్లాడినట్లు తెలిపారు. ప్రాజెక్ట్ పరిధిలో ఇంకా భూసేకరణ పూర్తికాని చోట్లా ఆయా జిల్లాల కలెక్టర్లతో మాట్లాడాలని సాగునీటి పారుదల శాఖ సీఈ వెంకటేశ్వర్లును ఆదేశించారు. భూసేకరణ పూర్తయిన చోట్లా పరిహారం చెల్లింపులు చేసేందుకు నిధులు విడుదల చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. నీటి పారుదల శాఖ అధికారులు చిత్త శుద్ధితో పని చేయాలని సూచించారు.
గోదావరి ఉన్నా ఫలితం లేదు : మంత్రి సీతక్క
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ.. దేవాదుల ప్రాజెక్ట్ పై తమ ప్రాంతంలో సమీక్ష నిర్వహించడం రెండోసారి అని, పక్కనే గోదావరి ఉన్నా ఫలితం లేదన్నారు. కన్నాయీగూడెం ప్రాంతానికి సాగునీరు అందడం లేదని సమావేశంలో వివరించారు. దేవాదుల ద్వారా రామప్ప చెరువు నిండితే ములుగులోని పలు ప్రాంతాలు ముంపునకు గురవుతాయన్నారు. తుపాకులగూడెం బ్యారేజ్ దేవాదుల బ్యారేజ్ నిర్మాణం కోసం భూమి కోల్పోయిన రైతులకు మానవీయ కోణంలో తగినంత నష్టపరిహారం అందించాలని పేర్కొన్నారు. మంగపేట, కన్నాయిగూడెం, ఏటూరు నాగారంలలో కెనాల్స్ పై ఏర్పాటు చేసిన లిస్టులో సరిగా పనిచేయక తాగునీరు అందడం లేదన్నారు. పాకాల ద్వారా నర్సంపేటకు నీరందిస్తూనే కొత్తగూడెంనకు కూడా సాగునీరు అందించేలా ప్రణాళికలు చేయాలని సూచించారు. ఈ విషయమై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ త్వరలోనే సీతక్క చెప్పిన సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
కాగా, ఈ సమీక్షా సమావేశంలో రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి తమ నియోజకవర్గాల పరిధిలో ఆయకట్టు విస్తీర్ణం, సాగునీటిపారుదల అంశాలను డిప్యూటీ సీఎం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు.
ఆఖరి ఆయకట్టుకు నీరు చేరాలి: ఎమ్మేల్యేలు
వర్దన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలో ఉన్నఆఖరు ఆయకట్టుకు దేవాదుల నీరు అందించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని కోరారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ మాట్లాడుతూ భీం ఘన్ పూర్ రిజర్వాయర్ కు సాగునీరు వచ్చేట్టు చర్యలు చేపట్టాలని కోరారు. కాగా, దేవాదుల ప్రాజెక్ట్ కు సంబంధించిన వివిధ దశలు, తాజాగా పూర్తి అయిన పనులు, భూసేకరణ, తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సాగునీటిపారుదల శాఖ సీఈ వెంకటేశ్వర్లు వివరించారు.
విద్యుత్ ఉప కేంద్రాలకు శంకుస్థాపన..
సమావేశానికి ముందుగా మంత్రులు సమక్క సాగర్ ప్రాజెక్ట్ ను సందర్శించి, గంగారం లోని దేవాదుల ఇంటెక్ వెల్ పంప్ హౌస్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం దేవాదుల పంపు హౌజ్ వద్ద మల్లంపల్లి మండలం కొడిశల కుంటలో రూ. 2.7కోట్లతో చేపట్టిన 33/11 కెవి విద్యుత్తు ఉప కేంద్రం శిలా ఫలకాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క ఇతర మంత్రులతో కలిసి ప్రారంభించారు. అదేవిధంగా ములుగు మండలంలోని గట్టమ్మ, బండారుపల్లి, జగ్గన్నపేట, లింగాల, నార్లపూర్, రొయ్యురు, బుచ్చంపేటలో రూ. 20.73 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 33/11 కెవి విద్యుత్ ఉప కేంద్రాలకు శంకుస్థాపన చేశారు. ఈ సమావేశంలో ములుగు కలెక్టర్ దివాకర టీ.ఎస్, ఇన్‌చార్జి ఎస్పీ కిరణ్ కారే, హనుమకొండ, వరంగల్ జిల్లాల అదనపు కలెక్టర్లు వెంకట్ రెడ్డి, సంధ్యారాణి, ఆర్డీవో లు సత్యపాల్ రెడ్డి, వెంకటేష్, ఇరిగేషన్ అధికారులు, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.




