తండ్రిని హతమార్చిన తనయుడు
వివాహం చేయడం లేదని ఘాతుకం
కాకతీయ,జగిత్యాల : వివాహం చేయించడం లేదన్న కోపంతో కుమారుడు కర్రతో తండ్రిని హతమార్చిన దారుణ ఘటన జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలోని బోయవాడలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.బోయవాడకు చెందిన గంగ నర్సయ్య (55) ప్రతీ రోజు లాగే ఉదయం ఇంటి ముందున ధ్యానం చేస్తున్నాడు. ఈ సమయంలో అతని కుమారుడు అన్వేష్ వివాహ సంబంధాలు చూడటం లేదని తండ్రితో వాగ్వాదానికి దిగాడు. మాటామాటా పెరగడంతో కోపావేశానికి లోనైన అన్వేష్ పక్కనే ఉన్న కర్రతో తండ్రి తలపై బాదాడు. తీవ్ర రక్తస్రావంతో నర్సయ్య అక్కడికక్కడే కుప్పకూలాడు.సమీపంలో ఉన్న అక్క హారిక భర్త నరేష్ సమాచారం తెలుసుకొని గాయపడిన నర్సయ్యను మెట్‌పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.మృతుని కూతురు హారిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై పబ్బ కిరణ్‌కుమార్ తెలిపారు.



