ఎర్రకోటకు సమీపంలో పేలుడు..
దేశ రాజధాని ఢిల్లీలో కలకలం
పార్కింగ్ చేసి ఉన్న కారులో పేలుడు
దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు
కాకతీయ, నేషనల్ డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో పార్క్ చేసిన ఒక కారులో పేలుడు సంభవించింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 వద్ద ఉన్న పార్కింగ్ స్థలంలో ఈ ఘటన జరిగింది. పేలుడు కారణంగా కారులో మంటలు చెలరేగాయి. ఆ మంటలు సమీపంలో ఉన్న మరో మూడు నుంచి నాలుగు కార్లకు వ్యాపించడంతో మొత్తం ఐదు కార్లు కాలిపోయాయి. ఈ ఘటనలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి, అయితే ప్రాణనష్టం జరిగినట్లుగా ఎటువంటి సమాచారం లేదు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది మరియు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చి, ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. పేలుడుకు గల కారణాలపై పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదవశాత్తు జరిగిందా లేదా ఏదైనా కుట్ర కోణం ఉందా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. ఇదిలావుండగా, ఈ రోజు ఉదయం ఢిల్లీ సమీపంలోని హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఉగ్రవాదులకు సంబంధించిన భారీ పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 350 కిలోల అమ్మోనియం నైట్రేట్, ఒక రైఫిల్ మరియు 20 టైమర్లను కారులో గుర్తించారు. ఈ కేసులో ఒక మహిళా వైద్యురాలి ప్రమేయం ఉన్నట్లు కూడా తేలింది. ఈ సంఘటన నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.


