జన సంచార ప్రాంతాల్లో కుక్కలు ఉండొద్దు
వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా కార్యాచరణ
కాకతీయ, వరంగల్ : జన సంచార ప్రాంతాల్లో వీధి కుక్కలు ఉండకూడదనే సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు.
సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ లో వీధి కుక్కల నియంత్రణ పై ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ తో కలిసి మాట్లాడారు. సుప్రీం కోర్టు నిబంధనలకు అనుగుణంగా నగరంలో జన సమూహ ప్రాంతాలైన పాఠశాలలు, రైల్వే, బస్ స్టేషన్లు, ఆసుపత్రులు పార్కులు, ఆలయాలు తదితర ప్రాంతాల్లో వీధి కుక్కలు సంచరించకుండా తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. యానిమల్ వెల్ఫేర్ బోర్డు ఆఫ్ ఇండియా (ఏడబ్ల్యూబీఐ) వారి సూచనలను పరిగణలోకి తీసుకొని గ్రేటర్ వరంగల్ వ్యాప్తంగా 66 డివిజన్ లలో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయడానికి ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ శానిటేషన్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ చంద్రశేఖర్, ఎస్ఈ సత్యనారాయణ, సీఎంహెచ్ఓ డా రాజారెడ్డి, సీహెచ్ ఓ రమేష్, ఇంచార్జి సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్ ప్రసన్న రాణి, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.


