ఫుడ్ పాయిజన్ బాధ్యులపై చర్య తీసుకోవాలి
కేంద్ర మంత్రి బండి సంజయ్
జమ్మికుంట బాలికల పాఠశాలలో 26 మందికి అస్వస్థత
కాకతీయ, కరీంనగర్ : జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో సోమవారం మధ్యాహ్నం భోజనం వికటించడంతో 26 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. భోజనం చేసిన కొద్దిసేపటికే పలువురికి వాంతులు, తలనొప్పి, విరేచనాలు కావడంతో ఉపాధ్యాయులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే విద్యార్థులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రాథమిక పరీక్షల్లో తేలికపాటి ఫుడ్ పాయిజన్ లక్షణాలు ఉన్నాయని, అందరూ ప్రమాదం నుంచి బయటపడ్డారని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విషయం తెలుసుకుని.. ఫుడ్ పాయిజన్ కు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని జిల్లా కలెక్టర్ ఆయనకు వివరించారు. తదుపరి చర్యల కోసం ఆహార సరఫరా నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపించినట్లు వారు తెలిపారు. ఈ ఘటనపై స్థానిక నాయకులు ఆకుల రాజేందర్, పొనగంటి రవికుమార్, కైలాసకోటి గణేష్, ఆకుల తిరుపతి తదితరులు ఆసుపత్రిని సందర్శించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.


