`బీసీ సీఎం`కే కట్టుబడి ఉన్నాం
రిజర్వేషన్లపై బీజేపీ ద్వంద్వ వైఖరి
స్థానిక పోరుకు 42శాతం పక్కా
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
కాకతీయ, తెలంగాణ బ్యూరో : బీసీని సీఎం చేయడానికి కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా కట్టుబడి ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని రవీంద్రభారతి ప్రాంగణంలో ఆదివారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 375వ జయంతి జాతీయ వారోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీసీ ముఖ్య మంత్రులు ఉన్నారని, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇప్పటివరకు ఎన్నిక కాలేదన్నారు. ఎవరి శాతం వారికి వాటా అన్న రాహుల్ గాంధీ ఆశయంతో భవిష్యత్తులో కాంగ్రెస్ నుంచి తప్పక బీసీ సీఎం వస్తారు అని ధీమా వ్యక్తం చేశారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు అసెంబ్లీలో మద్దతు తెలిపిన బీజేపీ, ఢిల్లీలో మాత్రం వెనక్కు తగ్గిందని విమర్శించారు. బీసీ రిజర్వేషన్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తికమకపెట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. కాగా, కూకట్పల్లి ఘటనను దురదృష్టకరమని పేర్కొంటూ, నగరంలో కల్లు కాంపౌండ్లపై జరుగుతున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. కల్లు కాంపౌండ్లకు సంబంధించిన తాటి చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, టీపీసీసీ జనరల్ సెక్రటరీలు వట్టికూటి రామారావు గౌడ్, మధు సత్యం గౌడ్‌తో పాటు వివిధ పార్టీల గౌడ్ సంఘ నాయకులు పాల్గొన్నారు.


