కేసీఆర్ కట్టించిన ఇళ్లనే ఇస్తున్నరు
`ఇందిరమ్మ`పై ఎలాంటి పురోగతి లేదు
బీ ఆర్ ఎస్ నేత మన్నె గోవర్ధన్ రెడ్డి
కాకతీయ, తెలంగాణ బ్యూరో : రేవంత్ పాలన ప్రజా పాలన కాదని, ప్రజా భక్షక పాలన అని బీ ఆర్ ఎస్ సీనియర్ నేత మన్నె గోవర్ధన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అధికారం లోకి వచ్చి 20 నెలలు దాటినా ఇందిరమ్మ ఇండ్లపై ఎలాంటి పురోగతి లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కట్టించిన ఇళ్లను మాత్రమే ఇప్పుడు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సైతం ఇదే విషయాన్ని అంగీకరించారని తెలిపారు. సంవత్సరానికి 4 లక్షల ఇళ్లు కడతామని చెప్పి, ఆ దిశగా ఒక్క అడుగు కూడా వేయలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు ప్రచార యావకే పరిమితమై, తమ కార్యకర్తలకే ఇళ్లు కేటాయిస్తున్నారని విమర్శించారు. రేషన్ కార్డుల విషయంలో కూడా కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేస్తోందని, హైదరాబాద్‌లో దరఖాస్తు చేసిన వారిలో కేవలం 53 వేల మందికే ఇచ్చారని అన్నారు. ఎన్నికల కోసమే హడావుడిగా పంపిణీ చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ హయాంలో 6.47 లక్షల రేషన్ కార్డులు జారీ చేశామని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో వర్షాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లపైనే కాకుండా వంతెనలపై కూడా నీరు నిలిచే పరిస్థితి ఏర్పడిందని, చిన్న చిన్న నిర్వహణ పనులు కూడా చేయలేని స్థితి వచ్చిందని అన్నారు. కేసీఆర్, కేటీఆర్ చొరవతో హైదరాబాద్‌లో గత 10 ఏళ్లలో 50 వేల కోట్ల రూపాయల అభివృద్ధి జరిగిందని, ఎస్‌ఆర్‌డీపీ కింద ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మాణం వలన ట్రాఫిక్ సమస్య తగ్గిందని గుర్తు చేశారు. రేవంత్ నిర్లక్ష్యం వలన మళ్లీ సమస్యలు పెరుగుతున్నాయని అన్నారు. సీఎం రేవంత్ విద్యాశాఖ, మున్సిపల్ శాఖ, హోంశాఖలో విఫలమయ్యారని, చేయలేక పోతే పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు. హోమ్ మంత్రిగా ప్రతిపక్షాలపై కేసులు పెట్టడమే ఆయన పని అయిపోయిందని, కొంతమంది అధికారులు కూడా కాంగ్రెస్ నేతల ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఎలాగూ రాబోయేది బీ ఆర్ ఎస్ ప్రభుత్వమే. తప్పు చేసిన అధికారులపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం అని ఆయన హెచ్చరించారు.


