ఒకేరోజు 3ఆలయాలకు అంబానీ రికార్డు డొనేషన్..లిస్ట్‌లో తిరుమల!
కాకతీయ, జాతీయం : దేశంలోనే అత్యంత సంపన్నుడిగా, ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామికవేత్తగా నిలిచిన ముఖేశ్ అంబానీ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేతగా ఆయన బిజినెస్ రికార్డులు క్రియేట్ చేస్తూనే, సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటారు. ఆధ్యాత్మికత, దాతృత్వం.. ఈ రెండు అంశాల కలయికతో అంబానీ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ఆదివారం కూడా అదే జరిగింది. ఒకేరోజు మూడు రాష్ట్రాల్లోని మూడు ప్రసిద్ధ ఆలయాలకు మొత్తం రూ.165 కోట్లకు పైగా విరాళాలు ప్రకటించి హెడ్‌లైన్స్ లో నిలిచారు.
ఆదివారం వేకువజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ముఖేశ్ అంబానీ, అనంతరం అద్భుతమైన సద్వినియోగంతో కూడిన దాతృత్వాన్ని ప్రదర్శించారు. తిరుమలలో నిత్యం రెండు లక్షల మందికి అన్నప్రసాదాలు తయారు చేసేందుకు అత్యాధునిక శాటిలైట్ కిచెన్ నిర్మాణానికి రూ.100 కోట్లు విరాళంగా ప్రకటించారు. ఈ నూతన వంటశాల అన్నప్రసాదం ట్రస్టుకు అంకితం కానుందని, ఇది అంబానీ కుటుంబం తరఫున భక్తి చిహ్నంగా ఉండబోతోందని రిలయన్స్ ప్రకటించింది.
తిరుమల దర్శనం తర్వాత ముఖేశ్ అంబానీ రాజస్థాన్‌లోని నాథ్‌ద్వారా ఆలయాన్ని సందర్శించారు. అక్కడ భక్తుల సౌకర్యార్థం యాత్రికుల సముదాయం నిర్మాణానికి ముందుకు వచ్చారు. మొత్తం రూ.50 కోట్ల వ్యయంతో రానున్న ఈ ప్రాజెక్ట్ మూడు సంవత్సరాల్లో పూర్తికానుంది. తొలి విడతగా రూ.15 కోట్ల చెక్కును అంబానీ దేవస్థానానికి అందజేశారు.
ఆ తర్వాత కేరళలోని ప్రసిద్ధ గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయాన్ని దర్శించిన అంబానీ, అక్కడ కూడా ప్రజా సేవలో భాగంగా మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి తన వంతు సహాయం చేశారు. తొలి విడతగా రూ.15 కోట్ల చెక్కును ఆలయ అధికారులకు అందజేశారు. మొత్తానికి తిరుమలలో అన్నదానం, నాథ్‌ద్వారాలో వసతి, గురువాయూరులో వైద్యం – ఈ మూడు రంగాల్లో అంబానీ చేసిన విరాళాలు కేవలం దాతృత్వం కాదు, సమాజం పట్ల ఉన్న ఆయన బాధ్యతను ప్రతిబింబిస్తున్నాయి. బిజినెస్ ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్నా, భక్తి మార్గంలో సాదాసీదా యాత్రికుడిలా ఉండే అంబానీ… మరోసారి ప్రజల మనసులు గెలుచుకున్నారు. ఇక ఒకేరోజు మూడు దేవాలయాల్లో రికార్డు డొనేషన్స్ ఇచ్చిన అంబానీపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.


