ఫంక్షన్‌కి వెళ్తున్న ఆటో బోల్తా.
12 మంది కి తప్పిన ప్రమాదం.
కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ఆదివారం ఉదయం ఒక పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఓ శుభకార్యానికి వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడి రెండు పాల్టీలు కొట్టడంతో పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఒకరికి చేయి విరగగా, మరికొందరికి స్వల్ప గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారం ప్రకారం సంతాయిపేట్ గ్రామానికి చెందిన సుమారు 12 మంది ఒకే ఆటోలో చిట్యాల వైపు శుభకార్యానికి బయలుదేరారు. తాడ్వాయి–చిట్యాల రహదారి మధ్యలోకి రాగానే ఆటో ఒక్కసారిగా అదుపు తప్పి పక్కకు బోల్తా పడింది. ప్రమాద తీవ్రతకు ప్రయాణికులు ఆటోలో చిక్కుకుపోయారు. వెంటనే అక్కడికెళ్లిన గ్రామస్థులు అందరినీ బయటకు తీసి 108 అంబులెన్స్‌కు సమాచారమిచ్చారు. గాయపడిన వారిని రెండు అంబులెన్స్‌లలో జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంనే కారణమని కొందరు చెబుతుండగా, రహదారిపై ఏర్పడిన గుంతలో టైర్ పడటం వల్ల అదుపు తప్పిందని మరికొందరు స్థానికులు తెలిపారు. ప్రమాద స్థలాన్ని పోలీసులు పరిశీలించగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సమయానికి సహాయ చర్యలు చేపట్టడంతో పెద్ద ప్రమాదం తప్పిందని గ్రామస్థులు తెలిపారు.


