ర్యాగింగ్’పై విచారణ జరిపించాలి
బీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, యువ న్యాయవాది జక్కనపల్లి గణేశ్
కాకతీయ, కరీంనగర్ : నాచుపల్లి శివారులో గల కొండగట్టు జేఎన్టీయూ క్యాంపస్ లో సీనియర్ విద్యార్థులు, బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థులను ర్యాగింగ్ చేసిన ఘటనపై యూనివర్సిటీ, పోలీస్ అధికారులతో విచారణ జరిపించాలని బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ (బీఎస్ఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు, యువ న్యాయవాది జక్కనపల్లి గణేశ్ డిమాండ్ చేశారు. ఇద్దరు జూనియర్ విద్యార్థుల చేత పెళ్లి చేస్తున్నట్లు తంతు జరిపించడం బాధాకరమన్నారు. చున్నీలు వేసుకుని డ్యాన్స్ చేస్తూ ఈ తంగాన్ని వీడియో చిత్రీకరించి, సీనియర్ విద్యార్థులు పోస్ట్ చేసి వైరల్ చేయడం దారుణమన్నారు. ఈ వికృత సంఘటన వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన జరిగి నాలుగు రోజులు గడిచి, ఆ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నప్పటికీ అధికారుల చర్యలు తీసుకోకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు. క్యాంపస్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఇటీవల కాలంలో విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించాడని విద్యార్థుల ఆందోళన కూడా చేశారన్నారు. క్యాంపస్ అడ్మినిస్ట్రేషన్ విఫలం కావడం వల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయన్నారు. వెంటనే యాంటీ ర్యాగింగ్ కమిటి ని ఏర్పాటుచేసి పూర్తిగా నిరోధించాలన్నారు. లేనిపక్షంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి ఐక్య ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు.


