తుఫాన్ నష్టాలపై ‘పక్కా అంచనాలు’ ఇవ్వాలి
రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
కాకతీయ, కరీంనగర్ : మొంథా తుఫాన్ కారణంగా జరిగిన నష్టాలపై ఎటువంటి నిర్లక్ష్యం చూపరాదని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ప్రతీ రైతు పొలాన్ని సందర్శించి, నష్టపోయిన ప్రతీ రైతును చేర్చి నివేదికలు సిద్ధం చేయాలని సూచించారు. తుఫాన్ నష్టం అంచనాలను నిర్ధిష్ట నమూనాలో తయారు చేసి సమర్పించాలని వ్యవసాయ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పంచాయతీ రాజ్ మరియు ఆర్‌అండ్‌బీ శాఖల పరిధిలో దెబ్బతిన్న రహదారులపై క్షేత్రస్థాయి పరిశీలన చేయాలన్నారు. తాత్కాలిక, శాశ్వత మరమ్మతులకు కావలసిన వ్యయ అంచనాలతో కూడిన నివేదికలు సమర్పించాలని తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులు దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు వంటి వివరాలను సమగ్రంగా సేకరించాలన్నారు. నీటి పారుదల శాఖ అధికారులు చెరువులు, కాల్వలు, నీటివనరులు దెబ్బతిన్న వివరాలు అందించాలని సూచించారు. ఇతర విభాగాలకు సంబంధించిన భవనాలు, దెబ్బతిన్న ఇండ్ల సంఖ్య, చనిపోయిన పశువులు, గొర్రెలు, పౌల్ట్రీ తదితర అంశాలను స్పష్టమైన ఆధారాలతో నివేదికల్లో చేర్చాలని మంత్రి పేర్కొన్నారు. తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన ప్రతీ కుటుంబానికి ప్రభుత్వం అందించే సహాయం కచ్చితంగా చేరేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.


