బుల్లెట్ లేదా థార్ కనిపిస్తే ఆపేస్తాం..!
కాకతీయ, జాతీయం : హర్యాణా డీజీపీ ఓ.పీ. సింగ్ తాజా వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. థార్, బుల్లెట్ వాహనాలు కేవలం ప్రయాణ సాధనాలు కావని.. కొందరికి అవి “స్టేటస్ సింబల్”గా మారాయని ఆయన అన్నారు. శనివారం గురుగ్రామ్‌లో విలేకరులతో మాట్లాడిన ఓపీ సింగ్.. ప్రతి వాహనాన్నీ రోడ్డుపై నిరంతరం ఆపి తనిఖీ చేయలేము. కానీ బుల్లెట్ లేదా థార్ కనిపిస్తే మాత్రం తప్పక ఆపేస్తాం. ఎందుకంటే అల్లరిచిల్లరగా తిరిగేవారు, పోకిరీలు ఎక్కువగా ఇవే వాడుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఒక వ్యక్తి ఎంచుకునే వాహనం వారి మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ముఖ్యంగా థార్ అంటే కేవలం ఒక కారు కాదు. అది ‘నేను ఎవరు’ అని చూపించే స్టేట్‌మెంట్ గా మారిపోయింది. నేటి తరం దానిని స్టేటస్ సింబల్‌గా ఉపయోగిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. థార్ లేదా బుల్లెట్ నడిపే చాలా మంది రోడ్లపై స్టంట్లు చేస్తూ, ప్రమాదాలకు కారణమవుతున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు.
ఓపీ సింగ్ తన వ్యాఖ్యల్లో ఒక తాజా ఘటనను ప్రస్తావించారు. ` ఒక ఏసీపీ కుమారుడు థార్‌తో ఒకరిని ఢీకొట్టి చంపాడు. ఇప్పుడు ఆ ఏసీపీ తన కొడుకును విడిపించాలని కోరుతున్నాడు. కానీ ఆ కారు ఎవరి పేరుమీద ఉందని ఆరా తీయగా.. అది ఆయనదే అని తేలింది. కాబట్టి అసలైన పోకిరి ఆయనే` అంటే ఓపీ సింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యతో డీజీపీ చట్టం ముందు ఎవరికీ రాయితీ లేదనే సందేశం ఇచ్చారు.
కాగా, థార్ లేదా బుల్లెట్ వంటి వాహనాలు యువతలో యాటిట్యూడ్ సింబల్‌గా మారడం, సేఫ్టీ కన్నా షో-ఆఫ్ కల్చర్ పెరగడం పోలీస్ అధికారులకు ఆందోళనగా మారింది. హెల్మెట్ లేకుండా బుల్లెట్‌పై రైడ్ చేయడం, ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించడం, పబ్లిక్ రోడ్లపై స్టంట్లు చేయడం.. ఇవన్నీ పోలీస్‌ల దృష్టిలో పెద్ద ముప్పుగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వాహనం ఎలా ఉంటుందో కాదు.. దాన్ని నడిపే వ్యక్తి ఆలోచన, ప్రవర్తన ముఖ్యమని ఓ.పీ. సింగ్ స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశమయ్యాయి. కొందరు ఓ.పీ. సింగ్ వ్యాఖ్యలను మద్దతు ఇస్తున్నా.. మరికొందరు మాత్రం ` అందరూ ఒకేలా ఉండరు.. ఇలాంటి వ్యాఖ్యలు వ్యక్తుల స్వాతంత్ర్యాన్ని బిగిస్తాయని` విమర్శిస్తున్నారు.


