తీగలగుట్టపల్లి రైల్వే ట్రాక్ వద్ద ఇరుక్కున్న లారీతో భారీ ట్రాఫిక్ జామ్.
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగర పరిధిలోని తీగలగుట్టపల్లి రైల్వే ట్రాక్ వద్ద శనివారం రాత్రి ట్రాఫిక్ స్తంభించింది. పత్తి లోడుతో కరీంనగర్ వైపు నుంచి వెళ్తున్న భారీ లారీ రైల్వే గేటు వద్ద ఇరుక్కుపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.స్థానికుల కథనం ప్రకారం.. భారి వాహనాలు వెళ్లకుండా ఏర్పాటు చేసిన గేట్ల ఎత్తు తక్కువగా ఉండటంతో లారీ అడ్డంగా ఇరుక్కుపోయింది. డ్రైవర్ గేట్ ఎత్తు గమనించకపోవడం వల్ల ఈ ఘటన చోటుచేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. లారీ చక్రాలు ట్రాక్ వద్ద కూరుకుపోవడంతో వాహనం కదలలేని స్థితి ఏర్పడింది.సమాచారం అందుకున్న అధికారులు, ట్రాఫిక్ పోలీసులు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. జేసీబీ సాయంతో రోడ్డును కొంత తవ్వి లారీని బయటకు తీసి రాకపోకలను పునరుద్ధరించారు. ఈ సమయంలో రెండు వైపులా వాహనాలు కిలోమీటర్ల మేర క్యూలో నిలిచిపోయి డ్రైవర్లు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ప్రస్తుతం రహదారి మీద పరిస్థితి సాధారణమైందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రైల్వే గేట్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు.



