అక్రమార్కులు అప్రమత్తం
నిద్ర మైకంలో మైనింగ్ అధికారులు
మల్లంపల్లి మట్టి దందాలో జాగ్రత్త పడుతున్న దొంగలు
కాకతీయ కథనాలతో అక్రమార్కులు అలర్ట్
రాత్రికి రాత్రే టిప్పర్, జేసీబీ టైర్ల గుర్తులు చెరిపేసే ప్రయత్నం
విజిలెన్స్ అధికారులు, కలెక్టర్ దృష్టిసారించేనా..?
కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా మల్లంపల్లి మండల పరిధిలో మైనింగ్ మాఫియా అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నా, అధికారులు మాత్రం కనీస కదలిక చూపకపోవడం స్థానికుల్లో ఆగ్రహం కలిగిస్తోంది. ప్రభుత్వ అనుమతులు ముగిసిన క్వారీలను మూసివేయాల్సింది పోయి, కొందరు రాజకీయ వ్యాపారవేత్తలు రాత్రింబగళ్లు భారీ యంత్రాలతో తవ్వకాలు కొనసాగిస్తూ కోట్ల రూపాయల లాభాలు గడిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మల్లంపల్లి, శ్రీనగర్, రామచంద్రాపురం, దేవనగర్ గ్రామాల పరిసర ప్రాంతాల్లో ఉన్న లాటరైట్, డోలమైట్ మైనింగ్ క్వారీలలో ఈ అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు సమాచారం. లీజు గడువు ముగిసినా కూడా ఎస్కవేటర్ లతో ఎర్ర మట్టిని తవ్వి, టిప్పర్ లలో లోడ్ చేసి రాత్రివేళల్లో వేరుజిల్లాలకు తరలిస్తున్నారు. మూడు రోజులుగా కాకతీయ దినపత్రిక ఈ అంశంపై వరుస కథనాలు ప్రచురించగా, పై అధికారుల ఒత్తిడి మేరకు గనులు మరియు భూగర్భశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో సరైన విచారణ చేయకుండానే “అక్రమ తవ్వకాలు ఏవీ లేవు” అంటూ వివరణ ఇవ్వడం గమనార్హం. ఈ నేపథ్యంలో మట్టి తవ్వకాలు జరిగిన ప్రాంతాలను ఆధారాలతో సహా కథనంలో పేర్కొంటూ శుక్రవారంసాయంత్రం కాకతీయ వెబ్సైట్‌లో మరోసారి ప్రచురించింది. అక్కడ ఎక్స్‌కవేటర్, టిప్పర్ గుర్తులు ఉన్నాయి అంటూ సాక్ష్యాలతో రుజువు చేయడానికి సిద్ధమని కాకతీయ పేర్కొంది. అయితే ఈ సమాచారం బహిర్గతమైన వెంటనే శనివారం రాత్రి మట్టి మాఫియా మూసివేయాల్సిన క్వారీ నుంచి అక్రమంగా మట్టి తవ్విన ఎస్కవేటర్‌ను అక్కడి నుంచి తొలగించి, టిప్పర్ రవాణా గుర్తులను చెరిపేసేందుకు విఫలయత్నం చేయడం గమనార్హం. పత్రికలో కథనం వెలువడిన వెంటనే అక్రమార్కులు మేల్కొని తవ్వకాలకు సంబంధించిన ఆనవాళ్లను దాచేందుకు ప్రయత్నిస్తుండగా, అధికారులు మాత్రం మౌనం వహించడం సర్వత్ర విమర్శలకు దారి తీస్తోంది.
అధికారుల నిర్లక్ష్యం…. ప్రజల్లో ఆగ్రహం….
ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లుతున్నప్పటికీ, సంబంధిత మైనింగ్ అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకోవడం లేదు అని, క్వారీల వద్ద తవ్వకాలు కొనసాగుతున్నాయా లేదా అన్న విషయంపై క్షేత్రస్థాయిలో తనిఖీలు జరపకపోవడం వారి బాధ్యతా రాహిత్యాన్ని బయటపెడుతోంది అని, అధికారుల కళ్ళముందే మట్టి దోపిడీ జరుగుతోంది అని, అధికారులు చూడనట్లు నటిస్తున్నారు అని, పైస్థాయి ఒత్తిళ్ల వల్ల చర్యలు తీసుకోవడంలేదు అని మండిపడ్డారు. మైనింగ్ అధికారుల పర్యవేక్షణ అనంతరం మట్టి మాఫియా టిప్పర్ గుర్తులను జరిపేయడం పట్ల అధికారుల అండదండల తో అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు భావిస్తున్నారు.
విజిలెన్స్, కలెక్టర్ జోక్యం అవసరం…
మల్లంపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో జరుగుతున్న ఈ అక్రమాలపై జిల్లా కలెక్టర్, విజిలెన్స్ అధికారులు స్వయంగా దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. అనధికారిక మట్టి తవ్వకాలు జరిగాయా లేదా అన్న విషయంపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో విచారణ జరిపిస్తే, నిజా నిజాలు వెలుగులోకి వస్తాయని అభిప్రాయపడ్డారు. అలాగే విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహిస్తే, అక్రమ తవ్వకాలకు చెక్ పడుతుందని, మైనింగ్ మోసాల వెనుక ఉన్న పెద్దల పేర్లు బయటపడతాయని స్థానికులు తెలిపారు.



