ఓటు @ రూ. 5వేలు !
జోరుగా ప్రధాన పార్టీల పోల్ మేనేజ్‌మెంట్ !
చివరి దశకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం
మరికొన్ని గంటల్లో ప్రచార పర్వానికి తెర
కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య టగ్ ఆఫ్ వార్ !
నియోజకవర్గంలో మొత్తం 3,92,669 ఓటర్లు
ఇందులో 24 శాతం మైనారిటీలే..
ముస్లిం మైనార్టీ ఓట్లపైనే ప్రధాన పార్టీల గురి
నవంబర్ 11న పోలింగ్ .. 14న రిజల్ట్స్
ఎన్నికల సంఘం పటిష్ట ఏర్పాట్లు
నియోజకవర్గంలో మద్యం దుకాణాలు బంద్
ఉత్తర్వులు జారీచేసిన సీసీ సజ్జన్నార్
కాకతీయ, తెలంగాణ బ్యూరో : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం చివరి దశకు చేరింది. మరికొన్ని గంటల్లో ప్రచార పర్వానికి తెరపడనుంది. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకారం… నవంబర్ 9 సాయంత్రంతో ప్రచారం ముగియనుంది. దీంతో మైకులు బంద్ కావటమే కాదు ..ఇతర ప్రాంతాల నేతలు కూడా నియోజకవర్గం వదిలి వెళ్లాల్సి ఉంటుంది. కాగా.. ప్రచార పర్వం ముగియనుండగా.. వెంటనే ప్రలోభాల పర్వం మొదలుకానుంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు పోల్ మేనేజ్మేంట్‌పై ఫోకస్ పెట్టాయి. చివరి నిమిషం వరకు పట్టు విడవకుండా పనిచేయాలని పార్టీ అధినాయకత్వాలు ఇప్పటికే కేడర్‌కు దిశానిర్దేశం చేశాయి. ఒక్కో ఓటును ఒడిసిపట్టాలని, డివిజన్లవారీగా పక్కాగా లెక్కలు వేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఈక్రమంలోనే గెలిచి తీరాలన్న పట్టుదలతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఓటుకు రూ. 5వేల చొప్పున పంచేందుకు సిద్ధమవుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఇందుకోసం వంద మంది ఓటర్లకు ఓ లీడర్ చొప్పున బాధ్యతలు అప్పగించినట్లు, ఇప్పటికే నియోజకవర్గంలో నగదు డంప్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. దాదాపు నాలుగు లక్షల మంది ఓటర్లు ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 24 శాతం మైనారిటీలు ఉన్నారు. అభ్యర్థి గెలుపు ఓటముల్లో ముస్లిం ఓట్లు కీలకంకానుండటంతో పార్టీలన్నీ
ఆ వర్గంపై దృష్టిపెట్టాయి.
మద్యం దుకాణాలు బంద్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం నవంబర్ 11వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం పటిష్టమైన ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఇక నవంబర్ 14వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి… ఫలితాలను ప్రకటించనున్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ దృష్ట్యా హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సజ్జనార్ కీలక ఆదేశాలను జారీ చేశారు. నియోజకవర్గం పరిధిలో 9వ తేదీ (ఆదివారం) సాయంత్రం 6 గంటల నుంచి ఉపఎన్నిక జరగనున్న 11వ తేదీ (మంగళవాం) సాయంత్రం 6 గంటల వరకు, తిరిగి ఓట్ల లెక్కింపు జరిగే 14వ తేదీన ఉదయం 6 గంటల నుంచి 15 సాయంత్రం 6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించారు. నిర్దేశించిన సమయాల్లో మద్యం దుకాణాలన్నీ మూసి వేయాలని, హోటళ్లు, రెస్టారంట్‌లు, క్లబ్బులు మూసివేయాలని సజ్జనార్ ఆదేశించారు. శాంతిభద్రతల నేపథ్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని వివరించారు. పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఐదుగురు, అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం నిషేధమని వివరించారు. ఓట్ల లెక్కింపు రోజున రహదారులు, జనావాసాల్లో బాణాసంచా పేల్చడం నిషేధమని, ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని సీపీ సజ్జనార్ హెచ్చరించారు.
నువ్వానేనా అన్నట్లుగా ..
ఈ ఏడాది జూన్ 8న బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నియోజకవర్గం పరిధిలో 3,92,669 ఓటర్లు ఉన్నారు. ఉప ఎన్నికకు గోపీనాథ్ భార్య మాగంటి సునీతను బీఆర్ఎస్ తన అభ్యర్థిగా ప్రకటించింది . కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్‌కు ఎంఐఎం పార్టీ మద్దతు ఇస్తోంది. బీజేపీ నుంచి దీపక్ రెడ్డి బరిలో ఉండగా ఆయనకు జనసేన సపోర్ట్ చేస్తోంది. వీరితోపాటు మరికొంత మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్యనే ప్రధానంగా పోటీ నెలకొంది. ప్రతి ఇంటికి వెళ్తూ… ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. తమ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .. బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఇక బీజేపీ నుంచి కూడా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ విస్తృత ప్రచారం చేపడుతున్నారు. అందరికంటే ముందే ప్రచారం ప్రారంభించిన బీఆర్ఎస్ రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లు నిర్వహించింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా రోడ్ షోలు చేపట్టి కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ పెంచారు. మరోవైపు బీజేపీ చీఫ్ రామచంద్రరావు దీపక్ రెడ్డికి మద్దతుగా డోర్ టు డోర్ కాంపెయిన్ చేశారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రచారంలో పాల్గొని కేడర్‌లో ఉత్సాహం నింపారు.



