- ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి గుగ్గిళ్ళ పీరయ్య
కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో లంబాడీ మండల జేఏసీ ఆధ్వర్యంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి గుగ్గిళ్ళ పీరయ్య హాజరై మాట్లాడారు. శుక్రవారం ఎమ్మార్పీఎస్ మండల కమిటీ అంటూ, మండలంలో గిరిజన సామాజిక వర్గానికి చెందిన అక్షయ్ రవి రాథోడ్ పై తప్పుడు ఆరోపణలు చేస్తూ బెదిరింపులు, బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని, ఆయన చేసిన ఆరోపణలలో నిజం లేదని అన్నారు. ఆయన ఆరోపణలను మండల లంబాడీ జేఏసీ తీవ్రంగా ఖండించిందన్నారు. ఆ సమావేశంలో పాల్గొన్న దళిత నాయకులకు, ఎమ్మార్పీఎస్ కు ఎటువంటి సంబంధం లేదన్నారు. ఏజెన్సీలో అన్నదమ్ముల వలె కలిసిమెలిసి జీవిస్తున్న గిరిజనుల, దళితుల మధ్య ఇటువంటి ప్రెస్ మీట్ లు పెట్టి గొడవలు సృష్టించడం సరైన పద్ధతి కాదని అన్నారు. సేవాలాల్ సేన నాయకుడు భూక్య రవి మాట్లాడుతూ విమర్శలు హుందాగా ఉండాలని, కించపరిచే విధంగా మాట్లాడకూడదని సూచించారు. లంబాడీ జేఏసీ నాయకుడు బానోతు మురళి కృష్ణ మాట్లాడుతూ తమ జాతి బిడ్డలను ఉద్దేశపూర్వకంగా నిరాధారంగా తిడుతూ, ఇష్టానుసారంగా కులం పేరు చెప్పుకొని ప్రెస్ మీట్లు పెడితే ఊరుకోబోమని అన్నారు. కార్యక్రమంలో జరుపుల శ్రీను, బానోతు లక్ష్మణ్, బాదావత్ నరేష్, అజ్మీర సునీల్, అజ్మీర దేవుజీ, బానోతు సతీష్, ఇస్లావత్ వీరన్న, భారతి బాయి, మహేష్, అజయ్, రాజశేఖర్, రమేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.


