మూడు రోజులు మేఘాల దాడి.. వాతావరణ శాఖ అలెర్ట్..

కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో రాబోయే మూడు రోజులు మేఘాల దాడి చేయనున్నాయి, వాతావరణ శాఖ ముందస్తు అలెర్ట్ జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కుండపోత వర్షం కురిసి రహదారులు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాతావరణ శాఖ తాజా హెచ్చరిక ప్రకారం ఈరోజు నుంచి రాబోయే సోమ, మంగళ వారాల్లోనూ ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సిద్ధిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, నాగర్‌కర్నూల్, కుమురం భీం ఆసిఫాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, జనగామ, హనుమకొండ, యాదాద్రి భువనగిరి, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. దక్షిణ కోస్తాంధ్ర తీరం వద్ద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు మరింత ముదురే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. శనివారం రాత్రి వర్షాల కారణంగా హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది అప్రమత్తమయ్యారు.

రెడ్ అలర్ట్‌లో దేశ రాజధాని.. జలమయమైన ఢిల్లీ..
డిల్లీ వాతావరణ శాఖ ఇవాళ కూడా భారీ వర్షాల అవకాశముందని హెచ్చరిస్తూ, డిల్లీలోనీ పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీలో గత రెండు రోజులుగా నుంచి కుంభవృష్టి వర్షాలు కురుస్తూ నగరాన్ని జలమయం చేశాయి. పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగి, రోడ్లు నదులను తలపిస్తున్నాయి. వాతావరణ శాఖ ఇవాళ కూడా భారీ వర్షాల అవకాశముందని హెచ్చరిస్తూ, పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. వర్షాల ప్రభావంతో విమాన సర్వీసులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 200కు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా, ఢిల్లీ ఎయిర్‌పోర్టు అధికారులు ప్రయాణికులకు ప్రత్యేక అడ్వైజరీ విడుదల చేశారు. ఎయిర్‌లైన్ల నుంచి తాజా అప్‌డేట్స్ తెలుసుకొని మాత్రమే ఎయిర్‌పోర్టుకు రావాలని సూచించారు. కన్నౌట్ ప్లేస్, మథుర రోడ్, భారత్ మండపం సహా అనేక ప్రాంతాల్లో భారీగా నీరు చేరి, వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉండగా, హిమాచల్‌ప్రదేశ్‌తో పాటు పలు ఉత్తరాది రాష్ట్రాల్లోనూ వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి.


