తెలంగాణ నీ అయ్య జాగీరా ?
రేవంత్ రెడ్డికి ఓటమి భయం పట్టింది
అందుకే ప్రజలను భయపెడుతున్నాడు
రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో అంతా విధ్వంసమే..
అరాచకపు పాలనకు జూబ్లీహిల్స్ ప్రజలు బుద్ధి చెప్తారు
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యకపోతే పథకాలు ఆపేస్తామని అనడానికి రేవంత్ రెడ్డి అయ్య జాగీరా అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఇంట్లో నుంచి డబ్బులు ఇస్తున్నాడా లేదా ఆయన నాయన డబ్బులు ఇస్తున్నాడా అని మండిపడ్డారు. ప్రజల సొమ్ము ప్రజలకు ఇస్తున్నారని చెప్పారు. అది ప్రభుత్వం బాధ్యత అని, రేవంత్ రెడ్డికి ఓటమి భయం పట్టింది.. అందుకే ప్రజలను భయపెడుతున్నాడని చెప్పారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రెండేండ్ల కాంగ్రెస్ అరాచకపు పాలనకు జూబ్లీహిల్స్ ప్రజలు బుద్ధి చెప్తారన్నారు. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మరో మూడేండ్లు రాష్ట్ర ప్రజలు నరకయాతన అనుభవించాలన్నారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో వికాసం, రేవంత్ రెడ్డి రెండేండ్ల పాలనలో అంతా విధ్వంసమని విమర్శించారు.
ముస్లింలకు క్షమాపణలు చెప్పాలి
కంటోన్మెంట్ ఉప ఎన్నిక ముందు ఇచ్చిన ఒక్క హామీ కూడా రేవంత్ రెడ్డి అమలు చేయలేదని మండిపడ్డారు. రోడ్లన్నీ గుంతలమయమయ్యాయని, వీధి దీపాలు లేవని, కాంగ్రెస్ గెలిచిన తర్వాత కంటోన్మెంట్ నియోజకవర్గం నాశనం అయిందని ధ్వజమెత్తారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో గెలిపిస్తే 6 వేల ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని చెప్పారని, రూ.23 కోట్ల స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టిస్తామని, డిఫెన్స్ భూములను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారని.. ఆ హామీలన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఉన్నందుకే ముస్లింలు ఉన్నారని, తాము లేకుంటే ముస్లింలకు ఇజ్జత్ ఉండదని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడని విమర్శించారు. ముస్లింలు స్వాతంత్య్రం కోసం యుద్ధం చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్కడుందని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ముస్లింలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించడం వల్లే ..
బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించడం వల్లే నేడు కాంగ్రెస్ మంత్రులు గల్లీల్లో పరుగులు పెడుతున్నారని విమర్శించారు. పీజేఆర్‌కు మంత్రి పదవి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి, ఆయన మరణానికి కారణం అయిందే కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి రేవంత్ రెడ్డికి ఎన్టీఆర్, పీజేఆర్ గుర్తుకువస్తున్నారని చెప్పారు. మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వాలని సోయి వచ్చిందన్నారు. ఇవన్నీ కేవలం ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఒత్తిడి పెంచడం వల్లనే జరిగాయని హరీష్‌రావు అన్నారు.


