- ప్రమాదకరంగా ఏనుమాముల మార్కెట్ వంద ఫీట్ల రోడ్డు
- ప్రాణాంతకంగా డివైడర్ స్థానంలో వేసిన పెద్దపెద్ద పైపులు
- ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోని బల్దియా ఇంజినీరింగ్ అధికారులు
- ప్రజలు మృతిచెందుతున్నా స్పందించని జీడబ్ల్యూఎంసీ పాలకులు
- ఇంకెంతమంది చనిపోతే పట్టించుకుంటారని ఆగ్రహిస్తున్న ప్రజలు
కాకతీయ, వరంగల్ : కాలాతీత పనులతో ప్రజలు కాలం చేయాల్సిన పరిస్థితులు దాపురించాయి. వరంగల్ మహానగరంలో ఆరేండ్ల క్రితం చేపట్టిన పనులు అసంపూర్తిగా వదిలేయడం ప్రాణాలకు ముప్పు తెచ్చిపెడుతోంది. రోడ్డు మధ్యలో వదిలేసిన పెద్దపెద్ద సొరంగాల్లాంటి సిమెంట్ పైపులు జీవితాలను మింగుతున్నాయి. స్థానికంగా నివసించే వారిని, రహదారి వెంట ప్రయాణించే వారిని భయంగొల్పుతున్నాయి. సంవత్సరాలు గడుస్తున్నా.. అధికారులు గానీ, ప్రజాప్రతినిధులు గానీ ప్రమాదాలను గుర్తించకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పాలకుల తీరుపై ప్రజల్లో ఆగ్రహానికి దారితీస్తున్నాయి.
బీఆర్ఎస్ హయాంలో మొదలై..!

ఆరేండ్ల క్రితం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వరంగల్ ఏరియా లేబర్ కాలనీ నుంచి ఏనుమాముల మార్కెట్ వెళ్లే మార్గంలో వంద ఫీట్ల రోడ్డు పనర్నిర్మాణం చేపట్టారు. గతంలో తారు రోడ్డు ఉండగా, దాని స్థానంలో సీసీ రోడ్డు వేశారు. ఇదే క్రమంలో డ్రెయినేజీ కోసమో, ఇంకే అవసరానికో పెద్దపెద్ద సిమెంట్ పైపులు వేయాలని నిర్ణయించారు. వాటిని తీసుకొచ్చి రోడ్డు మధ్యలో డివైడర్ నిర్మించే స్థలంలో వేశారు. ఒక్కో పైపు మనిషి ఎత్తులో ఉండగా, ఒకదానిపై ఒకటి అలా రెండు, మూడు అంతరాల్లో పెట్టారు. పనులు చేపట్టిన నాటి నుంచి ఏడాదిలోగా పనులు పూర్తి కావాల్సి ఉండగా, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం మూలంగా నేటికి ఆ పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఇదిలా ఉండగా పనుల్లో జాప్యం, లోపాల కారణంగా సదరు కాంట్రాక్టర్ ను వరంగల్ మహానగర పాలక సంస్థ రద్దు చేసి చేతులు దులుపుకుంది. మిగతా పనులు చేయించడంలో మీనమేషాలు లెక్కిస్తోంది. కనీసం అటువైపు కన్నెత్తి చూసే వారే కరువయ్యారు.
ప్రమాదకరంగా పైపులు..
ఇక ఈ మార్గంలో ఒకవైపు రోడ్డుపై వెళ్లే ప్రయాణికులకు మరో వైపు వెళ్లే ప్రయాణికులు, వాహనాలు కనపడని పరిస్థితి నెలకొంది. పైపులు వేసే క్రమంలో పలు కాలనీలకు వెళ్లేందుకు వీలుగా అక్కడక్కడా పైపుల మధ్య ఖాళీ స్థలం వదిలేశారు. ఇలా స్థానికులు రోడ్డుకు ఒక వైపు నుంచి మరో వైపు వెళ్లే క్రమంలో పైపులను దాటుతుండగా, అటువైపు వచ్చే వాహనాలు కనపడక ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఇలా ఇప్పటికే ఐదారుగురు ప్రాణాలు వదిలారు. ఇటీవల ఏనుమాముల మార్కెట్లో పనిచేసే సెక్యూరిటీ గార్డు ఒక్కరు రోడ్డు దాటుతుండగా.. పైపులైన్ ను ఆనుకుని నిలబడగా.. ఒక ద్విచక్రవాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సెక్యూరిటీ గార్డ్ మరణించాడు.
పట్టించుకోని ప్రజాప్రతినిధులు..
వరంగల్ నగరంలో ఒక మంత్రి, వర్ధన్నపేట ఎమ్మెల్యే, స్థానిక కార్పొరేటర్, ఒక మేయర్ ప్రాతినిధ్యం వహిస్తున్నా… ఈ అసంపూర్తి పనులను పట్టించుకున్న దాఖలాలు లేవు. జరుగుతున్న ప్రమాదాలను చూసైనా వారిలో చలనం కలగకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. కోట్లకు కోట్లు కుమ్మరించి.. మంచిగా ఉన్న భద్రకాళి చెరువు మత్తడిని కూలగొట్టి కొత్తది నిర్మించేందుకు మొగ్గు చూపిన ప్రజాప్రతినిధులు.. ఇక్కడ అసంపూర్తి పనులతో, రోడ్డుకు అడ్డంగా వేసిన పైపులతో ప్రాణాలు పోతున్నా.. ప్రజా సంక్షేమం పట్ల వారికున్న నిబద్దతకు అద్దం పడుతోంది. స్థానికులు సైతం పలుమార్లు ప్రజాప్రతినిధులకు విన్నవించినా గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసినా వారికి చీమకుట్టినట్లు కూడా లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీంతో పాలకుల తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకెంతమంది చనిపోతే.. ఈ పైపులను తొలగిస్తారని మండిపడుతున్నారు.


