- పర్మిషన్లు ఓ చోట.. తవ్వకాలు మరోచోట
- కౌసల్యదేవిపల్లి శివారు ఆకేరు నుంచి తోలకాలు
- ఫిర్యాదులు అందుతున్నా పట్టించుకోని అధికారులు
- ఇసుక ట్రాక్టర్ల యజమానులకు రెవెన్యూ అధికారి సపోర్టు
- పైపులైన్లు పగులుతున్నాయంటూ రైతుల ఆగ్రహం
కాకతీయ, నర్సింహులపేట : మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని ఆకేరు వాగు పరివాహక గ్రామాలైన కౌసల్యదేవుపల్లి, రామన్నగూడెం,ముంగిమడుగు గ్రామాల రైతులకు ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్లతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. రైతులు పంట పొలాలకు నీరు అందించడం కొరకు ఆకేరు వాగు నుండి పైపు లైన్లను పంటచేలకు వేసుకున్నారు. అక్రమంగా ఇసుక రవాణాన్ని చేస్తున్న ట్రాక్టర్లు తొక్కడం ద్వారా పైపులైన్లు పగిలిపోతున్నాయంటూ ఆకేరు పరివాహ ప్రాంతా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు పలుమార్లు తహసీల్దార్ కార్యాలయంలో విన్నవించుకున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై ఆకేరు పరివాహక రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా ఇసుక రవాణా ట్రాక్టర్ల లోకల్ నాన్లోకల్ ఘర్షణ శుక్రవారం చోటుచేసుకుంది. తహసీల్దార్ నాన్ లోకల్ ట్రాక్టర్లకు అనుమతులు ఇచ్చి లోకల్ ట్రాక్టర్లకు అనుమతులు ఇవ్వలేదని ఇసుక రవాణా ట్రాక్టర్లను కౌసల్యదేవిపల్లి గ్రామస్తులు అడ్డుకున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు ముంగిమడుగు శివారు పకీరతండ ర్యాంపు నుంచి మాత్రమే అనుమతులు ఇచ్చినట్లు రెవిన్యూ అధికారులు తెలిపారు. కానీ కౌసల్యదేవిపల్లి శివారు ఆకేరు వాగు నుంచి ఇసుక తోలడం గమనార్హం. ఈ తతంగమంతా రెవెన్యూ కార్యాలయంలోని ఒక అధికారి కనుసన్నల్లో జరుగుతోందని ట్రాక్టర్ల యజమానులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా తహసీల్దార్ చర్యలు తీసుకొని రైతుల పక్షాన నిలబడతాడో లేక ఇసుక అక్రమ రవాణా దారులకు వంత పాడుతాడో వేచి చూడాలి.


