గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో 99 రోజుల కార్యక్రమాలకు శ్రీకారం
– మున్సిపల్ కార్యాలయం నుంచి ఇందిరా పార్క్ చౌరస్తా వరకు ర్యాలీ
– పట్టణ అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేయాలీ
– వార్డు 16లో శిథిల గోడల పరిశీలన – వెంటనే చర్యలకు ఆదేశాలు
– ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలి
– చైర్పర్సన్ చందన రవీందర్, కమిషనర్ వెంకట గోపాల్
– మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి
కాకతీయ, గజ్వేల్ : గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పలు కార్యక్రమాలు నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్ అధ్యక్షతన, కమిషనర్ ఆర్. వెంకట గోపాల్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఉదయం 09:00 గంటలకు మున్సిపల్ కార్యాలయం వద్ద తెలంగాణ జాతీయ గీతం ఆలపించిన అనంతరం 99 రోజుల యాక్షన్ ప్లాన్ విజయవంతం చేయుటకు ప్రతిజ్ఞ చేశారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం నుంచి ఇందిరా పార్క్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ చందన రవీందర్ మాట్లాడుతూ… పట్టణ అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా పాలకవర్గ సభ్యులందరూ కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు. అనంతరం ర్యాలీగా పాత ఎంపీడీఓ కార్యాలయం వరకు వెళ్లారు. అక్కడ ఉన్న భవనాన్ని వయోవృద్ధుల పెన్షన్ పంపిణీ కేంద్రంగా, యువత కోసం రీడింగ్ రూమ్‌గా ఉపయోగించుకునేలా అందుబాటులోకి తీసుకురావాలని వార్డు ప్రజలు చైర్పర్సన్, కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి పట్టణ అభివృద్ధి కోసం తాము ఎప్పుడూ ముందుండి సహకరిస్తామని, ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు.

అనంతరం వార్డు నెంబర్ 16లో పాత ఎంపీడీఓ కార్యాలయం వెనుక శిథిలావస్థలో ఉన్న గోడలను పరిశీలించారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని చైర్పర్సన్ చందన రవీందర్, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి కమిషనర్ ఆర్. వెంకట గోపాల్‌కు ఆదేశించారు. అదే సమయంలో మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య పనులను ప్రారంభించి శుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. మురికి కాలువల్లో దోమల నివారణ కోసం పీచుకారి చేయడంతో పాటు క్రిమిసంహారక బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. అదేవిధంగా మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో పనికి రాని ఫర్నిచర్, స్క్రాప్ వస్తువులను తొలగించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కళ్యాణ్కర్ పద్మాబాయి నర్సింగరావు, కౌన్సిల్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రముఖులు, సెక్షన్ హెడ్లు, మెప్మా సిబ్బంది, ఎస్‌హెచ్‌జీ సభ్యులు, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


