92 ఇండిగో విమానాల రద్దు
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల ఆందోళన
ముందుగా బుక్ చేసుకున్న సర్వీసుల రద్దుతో తీవ్ర ఆగ్రహం
దేశంలోనూ వందలాది విమానాలు రద్దు
న్యాయమైన పోటీ లేకపోవడం వల్లే సమస్య
ప్రమాదంలో వేలాది ప్రయాణికుల భద్రత
కేంద్రంపై ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ఫైర్
కాకతీయ, తెలంగాణ బ్యూరో: ఇండిగో విమానాల రాకపోకలను నిలిపేయడంతో శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తం 92 ఇండిగో విమానాలు రద్దు చేసినట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఇందులో శంషాబాద్‌కు రావాల్సినవి 43, ఇక్కడి నుంచి వెళ్లాల్సినవి 49 సర్వీసులు ఉన్నాయి. ముందుగా బుక్ చేసుకున్న సర్వీసులను రద్దు చేయడం పట్ల ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెక్‌ఇన్ అయిన తర్వాత విమానాల రద్దు సమాచారం ఇవ్వడంపై ఎయిర్‌పోర్ట్‌లో నిరసన తెలిపారు. మరోవైపు విశాఖపట్నం నుంచి వెళ్లే 8 ఇండిగో విమాన సర్వీసులు రద్దు చేశారు. వీటిలో హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్, చెన్నైకు వెళ్లాల్సినవి కూడా ఉన్నాయి.
నాలుగు రోజులుగా తీవ్ర అవస్థలు
దేశంలోని అతి పెద్ద విమానయాన సంస్థ ఇండిగో సేవల్లో కొన్నిరోజులుగా తీవ్రమైన అంతరాయం ఏర్పడుతోంది. నాలుగు రోజులుగా కొనసాగుతున్న ఈ సంక్షోభం వల్ల దేశవ్యాప్తంగా వందలాది విమానాలు రద్దు అవ్వడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొన్ని ఎయిర్‌పోర్టుల్లో పరిస్థితి నియంత్రణలో లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దిల్లీ విమానాశ్రయంలో వేల సంఖ్యలో బ్యాగులు టెర్మినల్‌లో పేరుకుపోయాయి. 12 నుంచి 14 గంటల పాటు ప్రయాణికులు నీరు, భోజనం లేకుండా తీవ్ర అసహనానికి గురయ్యారు. ఈ సమస్యకు ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ నూతన దశ అమలులో వచ్చిన మార్పులు, క్రూ ప్లానింగ్‌లో పలు లోపాలు, శీతాకాలం కారణంగా ఆపరేషనల్ పరిమితులు, సిబ్బంది కొరత వంటి అంశాలు డీజీసీఏ సమీక్షలో ప్రధాన కారణాలుగా తేలాయి. ఈ నేపథ్యంలో ఇండిగో ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ నిబంధనల నుంచి ఎయిర్‌బస్ ఏ320 విమానాలకు మినహాయింపు కల్పించాలని డీజీసీఏను కోరింది. దీని పట్ల డీజీసీఏ ఇంకా ఎటువంటి నిర్ణయం ప్రకటించలేదు.
ఇది నియంతృత్వపు మోడల్ ఫలితం
ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ విమానాల రద్దు అంశంపై తీవ్రంగా స్పందించారు. ఇది ప్రభుత్వపు నియంతృత్వపు మోడల్ ఫలితమని వ్యాఖ్యానించారు. న్యాయమైన పోటీ లేకపోవడం వల్లే ఇటువంటి గందరగోళం ఏర్పడిందని ఆయన విమర్శించారు. రాజ్యసభలో శివసేన (ఉద్ధవ్ ఠాక్రే వర్గం) ఎంపీ ప్రియాంకా చతుర్వేది నిబంధన 180 కింద నోటీసు ఇవ్వడంతో పాటు పౌర విమానయాన మంత్రిత్వశాఖ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. వేలాది మంది ప్రయాణికుల భద్రత, సౌకర్యం ప్రమాదంలో పడటం అత్యంత ముఖ్యమైన అంశమని ఆయన పేర్కొన్నారు.


