తొలి విడత సర్పంచ్ ఎన్నికలకు 843 మంది పోలీసులు భారీ బందోబస్తు
కాకతీయ, జగిత్యాల : జగిత్యాల జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలను శాంతియుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బీమారం, కోరుట్ల, మెట్‌పల్లి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో ఎన్నికల సామగ్రి పంపిణీని కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య అధికారులు పరిశీలించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పోలింగ్ కేంద్రాలకు సామగ్రిని బలమైన ఎస్కార్ట్‌తో తరలించారు.జిల్లాలో మొత్తం 1172 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరగనుండగా, భద్రతా బాధ్యతల కోసం 843 మంది పోలీసు సిబ్బందిని నియమించారు. రూట్ మొబైల్‌లు, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, పెట్రోలింగ్ టీంలను విస్తృతంగా మోహరించి, పరిస్థితిని నిరంతరంగా పర్యవేక్షించేలా చర్యలు చేపట్టారు. పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే వాతావరణం కల్పించేందుకు ప్రత్యేక దిశానిర్దేశాలు జారీ చేశారు.పోలింగ్ బూత్‌లలో మొబైల్ ఫోన్లు, నీటి సీసాలు, ఇంక్ బాటిళ్లు, సామగ్రి వంటి వాటిని తీసుకురావడం నిషేధించినట్లు అధికారులు స్పష్టం చేశారు. బూత్‌లలో సెల్ఫీలు తీయడం పూర్తిగా నిషేధించబడింది. ఎన్నికల సమయంలో చట్టవ్యతిరేక చర్యలు చోటుచేసుకుంటే కఠినంగా వ్యవహరిస్తామని, ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేస్తామని అధికారులు పేర్కొన్నారు.ఎన్నికల ఏర్పాట్ల పరిశీలనలో అడిషనల్ ఎస్పీ, డీఎస్పీలు, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, కానిస్టేబుల్ బలగాలు పాల్గొన్నారు.


