టెన్త్ పరీక్షలకు 7,317 మంది విద్యార్థులు
మార్చి 14 నుంచి ఏప్రిల్ 15 వరకు ఎగ్జామ్స్
జిల్లాలో మొత్తం 34 పరీక్షా కేంద్రాలు
విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తొద్దు
పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
అదనపు కలెక్టర్ గడ్డం నగేష్
కాకతీయ, సిరిసిల్ల టౌన్ : జిల్లాలో నిర్వహించనున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు అన్ని శాఖలు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై బుధవారం సంబంధిత జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మార్చి 14 నుండి ఏప్రిల్ 15 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయని తెలిపారు. జిల్లాలో మొత్తం 7,317 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానుండగా, వారి కోసం 34 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పరీక్షా ప్రశ్నపత్రాలు, జవాబు పత్రాల రవాణా సమయంలో పటిష్ఠ బందోబస్తు చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. పరీక్షలు జరుగుతున్న సమయంలో నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. విద్యార్థుల సౌకర్యార్థం పరీక్ష సమయాలకు అనుగుణంగా తగినంత ఆర్టీసీ బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు తెలిపారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేయాలని, పరీక్షలు కొనసాగే సమయంలో సమీపంలోని జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలని స్పష్టం చేశారు. మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు తమ పరిధిలోని పరీక్షా కేంద్రాలను ముందుగానే పరిశీలించి అవసరమైన సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. ప్రతి కేంద్రంలో ప్రాథమిక వైద్య సదుపాయం కల్పించి, ఏఎన్ఎంలను అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. సమావేశంలో ఏఎస్పీ చంద్రయ్య, జిల్లా విద్యాధికారి జగన్ మోహన్ రెడ్డి, డీటీఓ నవీన్ కుమార్, ఆర్టీసీ, పోస్టల్, వైద్య శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మాదక ద్రవ్యాలను నియంత్రించాలి
డ్రగ్స్, మాదక ద్రవ్యాల వల్ల కలిగే తీవ్రమైన నష్టాలపై జిల్లాలో విస్తృత అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన జిల్లాస్థాయి నార్కోటిక్ కంట్రోల్ సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్యతో కలిసి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో జిల్లాలో నమోదవుతున్న ఎన్డీపీఎస్ కేసులు, గంజాయి సాగు నివారణకు చేపట్టిన చర్యలు, డ్రగ్స్ సరఫరా నియంత్రణ, మాదక ద్రవ్యాల నిర్మూలనకు శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా యువతలో పెరుగుతున్న డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టేందుకు విద్యాసంస్థల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మాదక ద్రవ్యాలకు బానిసైన వారిని గుర్తించి వారికి తగిన వైద్య చికిత్స, కౌన్సిలింగ్ అందించేలా చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులను అదనపు కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, ఎక్సైజ్ అధికారి శ్రీనివాసరావు, జిల్లా విద్యాధికారి జగన్ మోహన్ రెడ్డి, కార్మిక శాఖ అధికారి నజీర్ అహ్మద్, ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష తదితరులు పాల్గొన్నారు.


