రూ.6 లక్షల విలువైన 63 ఫోన్లు స్వాధీనం
బాధితులకు అందజేసిన ఎస్పీ మహేష్ బి. గితే
సీఈఐఆర్ పోర్టల్ వినియోగించుకోవాలంటూ సూచన
కాకతీయ, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ మరోసారి తమ సాంకేతిక నైపుణ్యాన్ని చాటుకుంది. జిల్లాలో ఇటీవల పోయిన, చోరీకి గురైన సుమారు రూ.6 లక్షల విలువ గల 63 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి సంబంధిత యజమానులకు అందజేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సెల్ ఫోన్ రికవరీ మేళాలో జిల్లా ఎస్పీ మహేష్ బీ గీతే స్వయంగా బాధితులకు ఫోన్లు అందించారు. ఈ ఫోన్లు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుండి సాంకేతికతను ఉపయోగించి ట్రేస్ చేసి రికవరీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో అత్యవసర సాధనంగా మారిందన్నారు. బ్యాంక్ ఖాతాలు, పాస్వర్డ్స్, ఫోన్‌పే, గూగుల్‌పే వంటి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ మొబైల్లోనే ఉండడం వల్ల దొంగలు వీక్ పాస్‌వర్డ్స్‌ను బ్రేక్ చేసి ఆర్థిక నష్టాలకు కారణమవుతున్నారని పేర్కొన్నారు. మొబైల్ పోయిన వెంటనే ఆలస్యం చేయకుండా సీఈఐఆర్ పోర్టల్‌లో ఫోన్ బ్లాక్ చేసి సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. సీఈఐఆర్ అప్లికేషన్ ద్వారా మొబైల్ ఫోన్లను ట్రేస్ చేసి రికవరీ చేయడంలో కృషి చేసిన ఐటీ కోర్ ఎస్.ఐ కిరణ్ కుమార్, కానిస్టేబుల్ రాజా తిరుమలేష్లను ఎస్పీ అభినందించారు. పోయిన మొబైల్ ఇక దొరకదని నిరాశ చెందిన బాధితులు, టెక్నాలజీ సహాయంతో తమ ఫోన్లు తిరిగి పొందడంతో ఆనందం వ్యక్తం చేస్తూ జిల్లా పోలీస్ యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఐటీ కోర్ ఎస్.ఐ కిరణ్ కుమార్, ఆర్.ఐ యాదగిరి, కానిస్టేబుల్ రాజాతిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు.


