ఆరోగ్యం కోసమే 5 కే రన్
ప్రజల సహకారం, భాగస్వామ్యంతోనే అభివృద్ధి
నగర మేయర్ గుండు సుధారాణి
పోచమ్మ మైదాన్ నుండి వేయిస్తంభాల ఆలయం వరకు కొనసాగిన రన్
హాజరైన వరంగల్, హన్మకొండ కలెక్టర్లు.. అధికారులు
కాకతీయ, వరంగల్ : ఆరోగ్య సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు 5కే రన్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మేయర్ గుండు సుధారాణి తెలిపారు. ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో పోచమ్మ మైదాన్ నుంచి హనుమకొండ వెయ్యిస్థంభాల ఆలయం వరకు నిర్వహించిన 5కే రన్‌ను జిల్లా కలెక్టర్ డా. సత్య శారద, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్లతో కలిసి మేయర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రణాళికలో భాగంగా ప్రతిరోజు ప్రజల భాగస్వామ్యంతో వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిపారు. ప్రజల సహకారం, భాగస్వామ్యం ఉన్నప్పుడే ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా విజయవంతం అవుతుందని పేర్కొన్నారు. ఆరోగ్య పరిరక్షణతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ హెల్త్ రన్ నిర్వహించామని చెప్పారు. గ్రేటర్ వరంగల్ ప్రజలకు తాగునీటి సరఫరా, పారిశుధ్యం వంటి సేవలను జీడబ్ల్యూఎంసీ ద్వారా అందిస్తున్నామని మేయర్ తెలిపారు.

వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ.. ఆరోగ్య పరిరక్షణకు ఇలాంటి 5కే రన్ కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని, ప్రజల్లో ఆరోగ్యంపై చైతన్యం పెంచేందుకు ఇవి దోహదపడతాయని పేర్కొన్నారు. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ఆరోగ్యానికి మించిన ఆస్తి ఏదీ లేదని, ఆరోగ్యంగా ఉంటేనే జీవితంలో విజయాలు సాధించగలమని అన్నారు. ఈ రన్ పోచమ్మ మైదాన్ వద్ద ప్రారంభమై ఎంజీఎం కూడలి, ములుగు రోడ్ మీదుగా వెయ్యిస్థంభాల ఆలయం వద్ద ముగిసింది. ఆరోగ్యకర జీవన విధానంపై ప్రజల్లో అవగాహన కల్పించారు. అనంతరం అధికారులు, యువత, ప్రజలు స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు సురేష్ జోషి, బస్వరాజు కుమారస్వామి, జన్ను శిభారాణి, అదనపు కమిషనర్ చంద్రశేఖర్, సీహెచ్‌ఎంఓ డా. రాజా రెడ్డి, సీహెచ్ఓ రమేష్, హనుమకొండ డీవైఎస్ఓ అశోక్, సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, ఎంహెచ్ఓ డా. రాజేష్ తదితరులు పాల్గొన్నారు.


