వరంగల్‌కు 5257.20 కోట్లు మంజూరు
అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పథకానికి పరిపాలనా అనుమతి
జీడబ్ల్యూఎంసీ పరిధిలో పనులకు ఊతం
అర్బన్ చాలెంజ్ ఫండ్ ద్వారా నిధుల సమీకరణ
విదేశీ సహాయం, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో కలిపి కేటాయింపులు
నగర పారిశుధ్యానికి కీలక మౌలిక సదుపాయం
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఉత్తర్వులు జారీ
కాకతీయ, వరంగల్ : గ్రేటర్ వరంగల్ నగరంలో సమగ్ర అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకానికి మొత్తం 5257.20 కోట్ల వ్యయంతో పరిపాలనా అనుమతి మంజూరు చేస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ నగరంలో ఆధునిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఫేజ్-1 కింద ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పథకం చేపట్టనున్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ జారీ చేసిన జీవో ఆర్.టి నెంబర్ 322 ప్రకారం ఈ పనులకు 5257.20 కోట్ల వ్యయాన్ని ప్రభుత్వం ఆమోదించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు శనివారం జారీ అయ్యాయి. ఈ ప్రాజెక్టు ద్వారా నగరంలో మురుగు నీటి నిర్వహణను పూర్తిగా శాస్త్రీయంగా నిర్వహించడానికి అవకాశం కలుగుతుంది. ప్రస్తుతం నగరంలో పెరుగుతున్న జనాభా, విస్తరిస్తున్న పట్టణ పరిమితులను దృష్టిలో పెట్టుకుని సమగ్ర డ్రైనేజ్ వ్యవస్థ అవసరం ఉందని అధికారులు పేర్కొన్నారు.
నిధుల సమీకరణ ఇలా
ఈ భారీ ప్రాజెక్టుకు అవసరమైన నిధులను మూడు వనరుల నుంచి సమీకరించనున్నారు. మొత్తం వ్యయంలో 50 శాతం విదేశీ ఆర్థిక సహాయం రూపంలో రుణంగా పొందనున్నారు. మరో 25 శాతం కేంద్ర ప్రభుత్వం అర్బన్ చాలెంజ్ ఫండ్ ద్వారా అందించనుంది. మిగతా 25 శాతం రాష్ట్ర ప్రభుత్వం వాటాగా భరించనుంది. జర్మనీకి చెందిన కెఎఫ్‌డబ్ల్యూ అభివృద్ధి సంస్థ ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం అందించేందుకు ఆసక్తి చూపినట్లు అధికారికంగా వెల్లడైంది. ఈ సంస్థ ప్రతినిధులు వరంగల్ నగరాన్ని సందర్శించి ప్రాజెక్టు వివరాలను పరిశీలించినట్లు అధికారులు తెలిపారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కోసం తయారు చేసిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను కూడా సంబంధిత సంస్థలకు అందజేసినట్లు సమాచారం. ప్రాజెక్టు అమలుకు సంబంధించి ముందస్తు అనుమతి కూడా పొందినట్లు అధికారులు పేర్కొన్నారు.
నగరాభివృద్ధికి కీలక అడుగు
ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్టు అమలుతో వరంగల్ నగరంలో పారిశుధ్య పరిస్థితులు మెరుగుపడతాయని అధికారులు భావిస్తున్నారు. మురుగు నీటి సమస్యలు తగ్గడంతో పాటు ప్రజారోగ్యానికి కూడా ఇది ఉపయోగపడనుంది. నగరంలో వర్షాకాలంలో తరచుగా ఎదురయ్యే మురుగు నీటి సమస్యలకు ఈ ప్రాజెక్టు దీర్ఘకాలిక పరిష్కారం చూపుతుందని అధికారులు తెలిపారు. నగరాభివృద్ధికి ఇది ఒక కీలక అడుగుగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులను రాష్ట్ర గవర్నర్ పేరుతో ప్రభుత్వం జారీ చేసింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ కార్యదర్శి డాక్టర్ టి.కె. శ్రీదేవి ఈ ఉత్తర్వులపై సంతకం చేశారు. ప్రాజెక్టు అమలు కోసం అవసరమైన చర్యలను తీసుకోవాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ మరియు డైరెక్టర్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. త్వరలోనే ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభం కానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.


