మామిడి పండ్ల కవర్లపై 50% రాయితీ
ఉద్యాన శాఖ ద్వారా సబ్సిడీ అమలు
మామిడి రైతులు సద్వినియోగం చేసుకోవాలి
కాకతీయ, కూసుమంచి : మామిడి రైతులు నాణ్యమైన పండ్ల ఉత్పత్తి సాధించేందుకు ఉద్యాన శాఖ ద్వారా మామిడి పండ్ల కవర్లపై రాయితీ అందిస్తున్నట్లు పాలేరు నియోజకవర్గ ఉద్యాన శాఖ అధికారి పి. అపర్ణ ఒక ప్రకటనలో తెలిపారు. రాయితీ వివరాల ప్రకారం, ఒక్క మామిడి పండ్ల కవరు ధర రూ.2.50 కాగా, దానిపై 50 శాతం రాయితీగా రూ.1.25 మంజూరు చేయబడుతుంది. ఒక ఎకరానికి గరిష్టంగా 8,000 పండ్ల కవర్లకు రాయితీ వర్తిస్తుందని తెలిపారు. ఒక్కో రైతుకు గరిష్టంగా 5 ఎకరాల వరకు మాత్రమే రాయితీ అందుబాటులో ఉండగా, మొత్తం 40,000 కవర్లకు సబ్సిడీ లభిస్తుందని స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని మామిడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాయితీ కోసం దరఖాస్తు చేయదలచిన రైతులు పాలేరు డివిజన్ ఉద్యాన శాఖ అధికారిని సంప్రదించవచ్చని తెలిపారు. పూర్తి వివరాలకు 89777 14104 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.


