సమ్మక్క జాతరకు 4వేల ఆర్టీసీ బస్సులు
మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్
కరీంనగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మంత్రి
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ మార్కెట్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న 9వ వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథసప్తమి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని సూర్యప్రభ వాహన సేవలో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, కరీంనగర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్ కుమార్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్‌తో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ… రాజకీయాలకు అతీతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించబడుతున్నాయని, తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో పాటు దాతల భాగస్వామ్యంతో అన్నదానాలు, హోమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. సమ్మక్క–సారలమ్మ జాతర ఈ నెల 28 నుంచి 31 వరకు నిర్వహించనున్నట్లు, జాతర కోసం ఆర్టీసీ 4 వేల ప్రత్యేక బస్సులు నడుపుతుందని వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని, ప్రజలే నిర్ణయం తీసుకుంటారని మంత్రి స్పష్టం చేశారు.


