370 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
రెండు లారీలు స్వాధీనం.. డ్రైవర్లు రిమాండ్
కాకతీయ, వరంగల్ బ్యూరో : పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న రెండు లారీలను పోలీసులు పట్టుకున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి క్రాస్‌రోడ్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా బియ్యం తరలిస్తున్న లారీలను గుర్తించి అడ్డుకున్నారు. ఏపీ–16 TY 1688, ఏపీ–28 TA 7432 నంబర్ల లారీల్లో తరలిస్తున్న బియ్యాన్ని సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్‌కు అప్పగించి పరిశీలించగా, అవి ప్రభుత్వం పంపిణీ చేసే పీడీఎస్ బియ్యమని నిర్ధారణైంది. సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ ఫిర్యాదు మేరకు లారీల డ్రైవర్లైన జార్ఖండ్‌కు చెందిన ఐతే కృష్ణ, ఐతే శ్రీకాంత్‌లపై కేసు నమోదు చేసి, బుధవారం వారిని రిమాండ్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు. విచారణలో ఈ బియ్యాన్ని ఖమ్మం జిల్లా మధిర నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు తెలిసిందని పాలకుర్తి ఎస్సై ప్రసన్న కుమార్ తెలిపారు. మొత్తం 370 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టుకున్నామని, వాటి విలువ సుమారు రూ.16 లక్షలు ఉంటుందని వెల్లడించారు. ఈ కేసులో పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఎస్సై స్పష్టం చేశారు.


