20 రోజుల్లో 364 కేసులు
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ఉక్కుపాదం
అన్ని పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక డ్రైవ్
డ్రైవింగ్ లైసెన్సుల స్వాధీనం.. రద్దు
డీఎస్పీ నాగేంద్రచారి హెచ్చరిక
కాకతీయ,రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రతి రోజు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సిరిసిల్ల సబ్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతోందన్నారు. సోమవారం మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించిన తనిఖీల్లో డీఎస్పీ స్వయంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గడిచిన 20 రోజులలో సబ్ డివిజన్ పరిధిలో మొత్తం 364 మంది పై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. మద్యం సేవించి వాహనం నడిపి ప్రమాదాలకు కారణమయ్యే వారిపై కేసులు నమోదు చేయడమే కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టుబడిన వారి డ్రైవింగ్ లైసెన్సులను స్వాధీనం చేసుకొని రద్దు కోసం సంబంధిత రవాణా శాఖ అధికారులకు పంపిస్తున్నామని చెప్పారు. జిల్లావ్యాప్తంగా ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించడంతోపాటు, మద్యం సేవించి పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు డిఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో పట్టణ ఇన్స్పెక్టర్ కృష్ణ, ట్రాఫిక్ ఎస్.ఐ శ్రీకాంత్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.


