- ఒక్కో ఇంట్లో 150 నుంచి 200 వరకు నమోదు
- ఎట్లైన గెలవాలని కాంగ్రెస్ అడ్డదారులు
- సామ, ధాన, భేద దండోపాయాలతో ప్రయత్నం
- క్షేత్రస్థాయిలో అధికారులపై చర్యలు తీసుకోవాలి
- తాము లేవనెత్తుతున్న ఆరోపణలు ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్ నుంచి తీసుకున్నదే..
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఈసీకి ఫిర్యాదు
కాకతీయ, జుబ్లిహిల్స్ : జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ ఓటు చోరీ అంటే.. చోరీ ఓట్లతో ఇక్కడ గెలవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఓటర్ల జాబితాలో ఉన్న దొంగ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు ఇతర అవకతవకలపై వినతిపత్రం సమర్పించారు. అనంతరం పార్టీ సీనియర్ నేతలతో కలిసి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఎట్లన్న గెలవాలని అన్ని అడ్డగోలు దారుల్లో ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. సామ, ధాన, భేద దండోపాయాలతో ప్రయత్నం చేస్తుందని.. మొత్తం రాష్ట్ర మంత్రులంతా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చేరి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి అధికార దుర్వినియోగంతో పాటు కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చేస్తున్న దొంగ ఓట్ల ప్రయత్నంపై రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి రిప్రజెంటేషన్ ఇచ్చామన్నారు.
400 బూత్‌లలో కనీసం 50 దొంగ ఓట్లు..
400 ఎన్నికల బూత్‌లలో కనీసం 50 దొంగ ఓట్లను కాంగ్రెస్ పార్టీ నమోదు చేసిందని కేటీఆర్ ఆరోపించారు. ఇట్లా కనీసం 20 వేల దొంగ ఓట్లను జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నమోదు చేయించిందని.. ఒక్కొక్క వ్యక్తికి మూడు ఎన్నికల గుర్తింపు కార్డులు ఉన్నాయని.. ఒక్కటే అడ్రస్ తో మూడు ఓట్లు.. నాలుగు ఓట్లు ఒక్కొక్కరు నమోదు చేయించుకుంటున్నారన్నారు. ఒక్కొక్క వ్యక్తికి రెండు మూడు ఓటర్ ఐడీలు ఉన్నాయని.. ఒకటే వ్యక్తికి చిన్న చిన్న అక్షరాలను మార్చి అనేక సార్లు ఓట్ల నమోదు చేయించారని ఆరోపించారు. తాము లేవనెత్తుతున్న ప్రతి అంశం కూడా ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్ నుంచి తీసుకున్నదేనన్నారు. కేవలం మా పార్టీకి ఇప్పటిదాకా దృష్టికి వచ్చినవి 20వేల డూప్లికేట్ దొంగ ఓట్లు ఉన్నాయని.. ఇంకా ఎన్ని ఓట్లు ఉన్నాయో ఎలక్షన్ కమిషన్ తేల్చాలని డిమాండ్ చేశారు. ఒక్కొక్క ఇంట్లో 150 నుంచి 200 ఓట్ల నమోదు జరిగిందని.. ఆయా ఇళ్లకు సంబంధించి తాము వెళ్లి చూస్తే ఒకటే ఒక చిన్న ఇంట్లో 100కు పైగా ఓట్ల నమోదు కూడా జరిగిన సందర్భాలు వందల సంఖ్యలో ఉన్నాయన్నారు. 15 వేల ఓట్లు కేవలం ఈ విధంగా చిరునామాలు లేకున్నా నమోదు చేసుకున్నారని ఆరోపించారు.
కుమ్మక్కుతో దొంగ ఓట్లు చేర్చినట్లుగా అనుమానం..
కాంగ్రెస్ పార్టీ కింది స్థాయి అధికారులతో కుమ్మక్కై దొంగ ఓట్లు చేర్చినట్టు అనుమానం ఉందని.. ఈ మొత్తం ఓటర్ లిస్టు అవకతవకల పైన వాటిపైన పూర్తిస్థాయి దర్యాప్తు జరగాలి అని డిమాండ్ చేశామన్నారు. క్షేత్రస్థాయిలో కుమ్మకు అయిన అధికారుల పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసి వారిని వెంటనే బదిలీ చేయాలని కోరామని.. 12వేల ఓట్లను వివిధ కారణాలతో తొలగించిన తర్వాత కూడా అదనంగా 7 వేల కొత్తగా చేరాయని.. మొత్తంగా డిలీట్ చేసినవి కొత్తగా చేరినవి కలిపితే సుమారు 19వేల కొత్త ఓట్లు కాంగ్రెస్ పార్టీ దొంగతనంగా చేరిందని ఆరోపించారు. ఈ అంశంలో పూర్తిస్థాయి దర్యాప్తు చేసి తగిన సమాధానం ఇస్తామని చెప్పిందని.. ఈ దొంగ ఓట్ల వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీని ప్రజల క్షేత్రంలో ఎండగడుతామని కేటీఆర్ స్పష్టం చేశారు.


