రోడ్డుపై 2 వేల నాటు కోళ్లు
ఎగబడి ఎత్తుకెళ్లిన గ్రామస్తులు
అనుమాతనంతో వరంగల్ ల్యాబ్‌కు పంపిన అధికారులు
ఎల్కతుర్తిలో సిద్దిపేట-ఎల్కతుర్తి రహదారిపై ఘటన
ఊరంతా పండుగ వాతావరణం
కాకతీయ, తెలంగాణ బ్యూరో: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో సిద్దిపేట-ఎల్కతుర్తి రహదారిపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు నాటుకోళ్లను రోడ్డుపై వదిలి వెళ్లిపోయారు. ఒకటి కాదు రెండు కాదు సుమారు 2 వేల నాటు కోళ్లను వదిలేశారు. ఒక్కసారిగా కోళ్లను చూసిన గ్రామస్తుల ఆనందానికి అవధులు లేవు. ఈ విషయం ఆనోటా ఈ నోటా పాకడంతో గ్రామస్తులంతా చేరి కోళ్లను పట్టుకున్నారు. ఒక్కొక్కరు రెండు, మూడు కోళ్లను పట్టుకొని ఇంటికి తీసుకువెళ్లగా.. కొందరు పదుల సంఖ్యలో తీసుకెళ్లారు. ఊరు ఊరంతా నాటు కోడికూర వండుకొని పండుగ చేసుకున్నారు. అయితే ఇంత పెద్దఎత్తున నాటు కోళ్లను ఎవరు ? ఎందుకు ? వదిలిపెట్టారనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది. ఈ విషయం తెలుసుకున్న పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్ పలు కోళ్లను పశువైద్యాధికారి దీపిక వద్దకు తీసుకెళ్లారు. ఆమె వాటిని టెస్టుల నిమిత్తం వరంగల్ ల్యాబ్‌కు పంపారు. ల్యాబ్ నుంచి నివేదిక వచ్చే వరకు వేచి చూడాలని, అప్పటి వరకు ఎవరూ వాటిని తినవద్దని ఆమె సూచించారు.


