రాష్ట్ర స్థాయి క్రీడలకు 20 మంది ఎంపిక
కాకతీయ, దుగ్గొండి : వరంగల్‌లో ఈ నెల 9, 10 తేదీల్లో నిర్వహించిన సీఎం కప్ రెండవ విడత జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో ఆదర్శవాణి హై స్కూల్, దుగ్గొండి బ్రాంచ్ విద్యార్థులు ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు. కోకో, కబడ్డీ, అథ్లెటిక్స్, జూడో, రెజ్లింగ్ విభాగాల్లో మొత్తం 20 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు విద్యాసంస్థల చైర్మన్ నాగనబోయిన రవి తెలిపారు. కోకో పోటీల్లో జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానం సాధించడం మండలానికి గర్వకారణమని డైరెక్టర్ కవిత బిక్షపతి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల నుంచి క్రీడాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహిస్తున్న సీఎం కప్ పోటీలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడంలో కీలకంగా ఉంటాయని అన్నారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులను పూలమాలతో సత్కరించి అభినందించారు. క్రీడలతో పాటు చదువులో కూడా రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ స్రవంతి, వ్యాయామ ఉపాధ్యాయులు చందన, దేవేందర్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.


